-దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం..
-తడిసిన జొన్నల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు ప్రతిపాదిస్తాం..
-జిల్లా ప్రతేక అధికారి యం. గిరిజా శంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన ఆకాల వర్షాల వలన దెబ్బతిన్న ధాన్యాన్ని రైస్ మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, తడిసిన జొన్నలను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు ప్రతిపాదిస్తామని జిల్లా ప్రత్యేక అధికారి, స్టేట్ ట్యాక్స్ ఛీఫ్ కమీషనర్ యం. గిరిజా శంకర్ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం వద్ద ఇటీవల కురిసిన వర్షానికి తడిసి దెబ్బతిన్న ధాన్యం, జొన్నల రాసులను శుక్రవారం జిల్లా ప్రత్యేక అధికారి స్టేట్ ట్యాక్స్ ఛీఫ్ కమీషనర్ యం. గిరిజా శంకర్, జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రబీ పంటలో సుమారు 64,771 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేయడం జరిగిందన్నారు. వరి కోతలు ప్రారంభమైన తరుణంలో రూరల్ మండలంలోని నున్న, పాతపాడు, కండ్రిక, గూడవల్లి గ్రామాలలో రైతులు వరి పంట కోసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించే తరుణంలో 9,018 క్విటాళ్ళ ధాన్యం అకాల వర్షాలకు తడిసి దెబ్బ తినడం జరిగిందన్నారు. దీనితో పాటు జొన్నలు కూడా తడిసి దెబ్బతినడం జరిగిందన్నారు. పంట దెబ్బతిన్న వెంటనే ప్రభుత్వం దృష్టికి రాగానే క్షేత్రస్ధాయిలో పరిశీలించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించడం జరిగిందన్నారు. రైతులు పంట కోసి ఆరబెట్టుకున్న సమయంలో వర్షం కారణంగా ధాన్యం తడిసి రంగుమారడంతో పాటు తేమ శాతం అధికంగా ఉండడంతో ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్స్ ముందుకు రావడం లేదని ధాన్యం కొనుగోలు చేసి తరలించకపోతే తీవ్రంగా నష్ట పోతామని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో సుమారు 400 మెట్రిక్ టన్నుల జొన్నలు ఆరబెట్టే సమయంలో వర్షానికి తడిసి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేయడం జరిగిందన్నారు. దెబ్బతిన్న జొన్నలను కొనుగోలు చేసేలా మార్క్‌ఫెడ్ అధికారులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. దెబ్బతిన్న ధాన్యం విషయంలో రైతులు అందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తక్షణమే కొనుగోలు కేంద్రాలకు తరలించి రైతులను ప్రభుత్వ ఆదుకుంటుందని జిల్లా ప్రత్యేక అధికారి స్టేట్ ట్యాక్స్ ఛీఫ్ కమీషనర్ గిరిజా శంకర్ తెలిపారు.
జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ రూరల్ మండలంలో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో రబీ పంటకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేయడంలో రైతులకు ఇటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. రైస్ మిల్లర్ల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించామన్నారు. ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షణ భాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. తడిసిన ధాన్యం పరిశీలనలో ప్రత్యేక అధికారి గిరిజా శంకర్ వెంట పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, డిఎస్‌వో కోమలి పద్మ, జిల్లా వ్యవసాయ అధికారిణి ఎస్ నాగమణమ్మ, ఏడి వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారులు రఘురామ్, రంగనాథ్‌బాబు, పిఏసిఎస్ అధ్యక్షులు చంద్రారెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వై నాగిరెడ్డి, రైతులు ఉన్నారు.
Prajavartha Online Telugu News