Breaking News

గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛభారత్ వంటి పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో పర్యావరణ పరిరక్షణ, ధాన్యము, మొక్కజొన్న సేకరణ, స్పందన, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేశాయన్నారు. ఇందులో భాగంగా సముద్రతీరాలు పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని, మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పలు పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అందులో జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులతో పాటు ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖకు లక్ష్యం నిర్దేశించడం జరిగిందన్నారు.  ముఖ్యంగా గ్రామాలు మండలాలు, మునిసిపాలిటీలలో అన్ని రకాల స్వచ్ఛభారత్ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను విరివిగా భాగస్వాములు చేయాలన్నారు.
గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మురికి కాలువలు, ఎక్కడపడితే అక్కడ పడేసినవి తొలగించాలన్నారు. ఇందులో ప్రజలను, వాలంటీర్లను, పాఠశాల విద్యార్థిని విద్యార్థులను భాగస్వాములు చేయాలన్నారు.
పర్యావరణ పరిరక్షణపై ఓరియంటేషన్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఇది ఒక గొప్ప అవకాశం అని పంచాయతీరాజ్ శాఖ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈనెల 21వ తేదీన మంగినపూడి సముద్రతీరంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
జిల్లాలో గురువారం 125 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో దెబ్బతిన్న మొక్కజొన్న, జొన్న పంటల నష్టం వివరాలను నూటికి నూరు శాతం కచ్చితంగా నమోదు చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారులు, తహసిల్దార్లు నిర్ణీత నమునాలో వివరాలను సేకరించి పంపాలన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని స్పష్టం చేశారు జిల్లాలో సేకరించిన ధాన్యానికి బిల్లుల చెల్లింపు చేసే కార్యక్రమం మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
ఇప్పటివరకు 38 కోట్ల రూపాయలను ధాన్యం సేకరణ కోసం రైతులకు చెల్లించడం జరిగిందని, ఇంకా దాదాపు 23 కోట్ల రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉందన్నారు. గురువారం మచిలీపట్నం డివిజన్లో 2.20 కోట్ల రూపాయలు, గుడివాడ డివిజన్లో 1.74 కోట్ల రూపాయలు, ఉయ్యూరు డివిజన్లో 70 లక్షల రూపాయలు దాన్యం సేకరణ కింద రైతులకు చెల్లించడం జరిగిందన్నారు.
ధాన్యం బిల్లుల చెల్లింపు పై గట్టిగా నిఘా ఉంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలో ఎక్కడా కూడా కోత లేకుండా పక్కాగా చెల్లింపులు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించాలన్నారు.
ఇందుకోసం ధాన్యం బిల్లులు పొందిన రైతులతో ముఖాముఖి మాట్లాడి వాస్తవ విషయాలు తెలుసుకోవాలన్నారు. స్పందన, జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు. వాటి పరిష్కారానికి కొంత సమయం కేటాయించి నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలన్నారు.
జిల్లాలో పరిష్కారం పొందిన అర్జీలు మరలా వస్తున్నాయని వాటిపై సంబంధిత శాఖధిపతులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలన్నారు. ఎవరైనా సరే తప్పుడు సమాధానం తెలియజేస్తూ అర్జీదారులకు ఎండార్స్మెంట్ ఇస్తే అటువంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శాఖాధిపతులు వారి కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి సరైన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ( ఎస్ఓపి) సిద్ధం చేయాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు తదితర క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *