విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాతృమూర్తి స్వర్గీయ బాల త్రిపుర సుందరమ్మ సంస్మరణ కార్యక్రమం శనివారం గవర్నర్ పేటలోని ఐ.వి.ప్యాలస్ నందు ఘనంగా జరిగింది. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని సుందరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సుందరమ్మ జీవిత పయనంపై ప్రదర్శించిన వీడియో వీక్షకుల చేత కంటి తడి పెట్టించింది. మల్లాది వేంకట సుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిగా సమాజానికి సుందరమ్మ అందించిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. 2013 లో ఆమె స్థాపించిన ట్రస్ట్ నేటికీ సేవలను కొనసాగించడం గొప్ప విషయమన్నారు. ఉచిత రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ల పంపిణీ, హెల్త్ క్యాంపులు, నిరుపేదలకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు, ప్లాట్ ఫామ్ రిక్షాలు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు అందజేయడం, కరోనా సమయంలో పేదలకు ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ వంటి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కీర్తించారు. క్రమశిక్షణకు మారుపేరైన సుందరమ్మ ఉపాధ్యాయురాలిగా ఎందరో భావిభారత పౌరులను తీర్చిదిద్దారని.. సుందరమ్మ నేర్పిన విలువలతో మల్లాది విష్ణు తన జీవితాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి మంచి మనిషి మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు. సుందరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాల్ కృష్ణ, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, ఎండి రుహుల్లా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నాగ నారాయణమూర్తి, ఏపీఐడీసి ఛైర్‌పర్సన్ బండి పుణ్యశీల, నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డి, టీడీపీ నేత నాగుల్ మీరా, సీపీఎం నేత ch బాబురావు, వైసీపీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, డాక్టర్ పి. వి. రమణమూర్తి, డాక్టర్ పి. వి. రామారావు, డాక్టర్ ఈశ్వర్, డాక్టర్ మెట్లపల్లి జగన్మోహన్, డాక్టర్ నోరి సూర్య నారాయణ, వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News