విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి వ్యక్తి తన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. కేంద్రప్రభుత్వం మిషన్ లైఫ్ 2022-23 లైఫ్‌స్టైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ లో భాగంగా ప్రతి వ్యక్తి తన జీవన విధానాన్ని మార్చుకోవడంపై కలెక్టరేట్లోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా మన జీవన శైలిలో కొన్ని మార్పులు తీసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. ఆహారఆలవాట్లలో జంక్ఫుడ్స్ వాడకాన్ని పూర్తిగా తగ్గించుకుని పుప్పుదాన్యాల వినియోగాన్ని పెంచుకోవాలన్నారు. గ్రామాలలోని చెరువుల పూడిక తీయడం ద్వారా నీటి నిల్వ పెరిగి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. నీటిని ఎక్కువగా వినియోగించుకునే పంటలకు బదులుగా పప్పుధాన్యాల పంటలను ప్రొత్సహించడం, రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను వాడడం, పంట పొలాలలో నీటి వృధా కాకుండా పంపు సెట్లను ఆటోమెటిక్ సెన్సార్ ద్వారా నియంత్రిండం, వ్యక్తి గత వాహనాలకు బదులుగా ప్రజారవాణా అయిన బస్సులు, సెకిళ్ళును ఉపయోగించడం, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇంజన్ ఆఫ్ చేయడం, విద్యుత్‌ను పొదుపు చేసేందుకు ఎల్ఇడి బల్బులను వాడడం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ అనుకూల గుడ్డ సంచులను వినియోగించడం వంటి వాటిపై సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు, వ్యాపారస్థులు, విద్యార్థులు, రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. అనంతరం ‘‘పర్యావరణ పరిరక్షణపై నేను నా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తానని.. నేను దీనికి పూర్తిగా కట్టుబడి నావంతు సహకారం అందిస్తానని’’… జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిఆర్వో కె. మోహన్‌కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ టి.ప్రసాదరావు, జిల్లా అటవీ శాఖ అధికారి ఎవిఎస్‌ఆర్‌కె. అప్పన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News