విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రీసర్వే, జాతీయ రహదారుల విస్తరణ, గృహ నిర్మాణాల స్టేజ్ కన్వర్షన్, తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డికి వివరించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్ జవహర్ రెడ్డి ఆయన కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రీసర్వే, జాతీయ రహదారుల విస్తరణ, గృహ నిర్మాణాలు, జగనన్న పాల వెలువ, తదితర అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రీసర్వే పూర్తి అయిన గ్రామాలలో సర్వే రాళ్ళను నాటే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఆర్జీలను నాణ్యతతో ఆర్జీదారుల సంతృప్తి మేరకు పరిష్కరిస్తున్నామన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించి నిర్థేశించిన లక్ష్యాల మేరకు వివిధ దశలలో ఉన్న నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 3,345 గ్రామాలలోని 22,884 మంది పాడిరైతులను నమోదు చేశామన్నారు. వీరికి వైఎస్సార్ చేయూత, స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ లింకేజ్ ద్వారా 2,041 పశువులను అందించామన్నారు. వివిధ దశలలో చేపడుతున్న మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని మొదటి దశలలో 8 భవన నిర్మాణాలు పూర్తి చేశామని రెండవ దశలో 43 భవన నిర్మాణలకు స్థల కేటాయింపు జరిగిందనిజిల్లా కలెక్టర్ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్‌కుమార్, డిఆర్డిఏ పిడి కె. శ్రీనివాస్‌రావు, హౌసింగ్ యం.రజినీ కుమారి, వ్యవసాయ శాఖ అధికారి ఎస్. నాగమణమ్మ, జిల్లా సర్వే అధికారి కె.సూర్యారావు, జిల్లా కోఆపరేటివ్ అధికారి సిహెచ్ శైలజ, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎ.నాగరాజ పశుసంవర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్ ఉద్యాన శాఖ అధికారి పి.బాలాజీ కుమార్ ఉన్నారు.
Prajavartha Online Telugu News