-సిఎప్ఎంఎస్ లో పెండింగ్ లో ఉన్న 2,760 బిల్లులకు రూ.510.46 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ స్థానిక సంస్థల్లో కాంట్రార్టర్లకు బిల్లులు చెల్లించలేదనంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇప్పటి వరకూ సి.ఎప్.ఎం.ఎస్.లో పెండింగ్ లో ఉన్న 2,760 బిల్లులకు సంబందించి రూ.510.46 కోట్లు చెల్లింపు చేయడం జరిగిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిధులు కొరత కూడా ఏమాత్రం లేదని, ఎటు వంటి బిల్లుల బకాయిల ఉన్నా సరే వెంటనే చెల్లించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. 2017-18 సంవత్సరంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సి.ఎప్.ఎం.ఎస్. విదానంలో అనుసరిస్తున్న ప్రొటోకాల్ విదానం వలనే చెల్లింపుల్లో జాప్యానికి కారణమని మంత్రి తెలిపారు. సోమవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో రాష్ట్ర పురపాల, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీతో కలసి మంత్రి పాత్రికేయులతో మట్లాడుతూ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ పరంగా నిర్వహిస్తున్నపనులు, వాటి చెల్లింపులకు సంబందించిన విషయాలను వివరించారు.
రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో బిల్లులు అన్నీ పేరుకు పోయాయని, గుత్తేదారులకు చెల్లింపులు జరపకపోవడం వల్ల పనులన్నీ అగిపోయాయని, పనుల నిర్వహణకు ఎన్ని సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రావడం లేదంటూ పలు అవాస్తవాలతో కథనాన్ని ఒక ప్రముఖ దినపత్రిలో ప్రచురించడాన్ని మంత్రి ఖండించారు. ఈ వార్తాంశంలో ఏమాత్రం నిజంలేదని, ప్రభుత్వంపై విషంజిమ్మేలా అవాస్తవాలతో ఈ కథకాన్ని ప్రచురించడం జరిగిందంటూ వాస్తవాలను ఆయన వివరించారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ పనులకు సంబందించి గత వారం పదిరోజుల్లో సి.ఎప్.ఎం.ఎస్.లో పెండింగ్ లో నున్న 2,760 బిల్లులకు సంబందించి రూ.510.46 కోట్లు చెల్లింపు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో కరెంటు చార్జీల 16 బిల్లులకు రూ.20.54 కోట్లు, 1,926 వర్కు బిల్స్ కు రూ.258.20 కోట్లు, సచివాలయాల అద్దెలకు సంబందించి 2 బిల్లులకు రూ.9.19 కోట్లు, 44 మిస్లేనియస్ బిల్లులకు సంబందించి రూ.51.98 మరియు ఇతర ఖర్చులకు సంబందించిన బిల్లులు కలుపుకుని మొత్తం 1,992 బిల్లులకు సంబందించి రూ.340.67 కోట్లు మేర మున్సిఫల్ జనరల్ ఫండ్స్ ను చెల్లించడం జరిగిందన్నారు. 14 వ మరియు 15 వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టబడిన పలు పనులకు సంబందించి మొత్తం 768 బిల్లులకు రూ.169.79 కోట్లను చెల్లించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా పలు పట్టణ స్థానిక సంస్థలకు సంబందించి పెడింగ్ బిల్లులకు కూడా చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. పట్టణ స్థానిక సంస్థలైన పలాస-కాసీబుగ్గ కు రూ.2.10 కోట్లు, వైఎస్సార్ తాడిగడప కు రూ.11.87 కోట్లు, సాలూరు కు రూ.1.02 కోట్లు, గుంటూరు మున్సిఫల్ కార్పొరేషన్ రూ.13.28 కోట్లు, జంగారెడ్డి గూడెంకు రూ.1.91 కోట్లు, పిడుగురాళ్ల కు రూ.1.37 కోట్లు, మరియు ఎర్రగుంట్ల కు రూ.1.00 కోటి వెరసి మొత్తం రూ.32.58 కోట్లను 269 బిల్లల్స్ సంబందించి చెల్లింపు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. తాడేపల్లి-మంగళగిరి మున్సిఫల్ కార్పొరేషన్ కు సంబందించి ఈ ఏడాది మే 22 వ తేదీ నాటికి పెండింగ్ లో పలు బిల్లులకు సంబందించి రూ.13.61 కోట్లు మేర జనరల్ ఫండ్స్ ను చెల్లించడం జరిగిందన్నారు. ఈ కార్పొరేషన్ లో 14 వ మరియు 15 వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టబడిన పనులు అన్నింటికి పూర్తికా చెల్లింపులు చేయడం జరిగిందని, ఎటు వంటి బకాయిలు లేవని ఆయన తెలిపారు. తాడేపల్లి-మంగళగిరి మున్సిఫల్ కార్పొరేషన్ లో ఫేజ్-2 లో జనరల్ ఫండ్స్, 14 మరియు 15 వ ఆర్థిక సంఘం నిధుల చేపట్టబడిన పనులకు కూడా సుమారు రూ.44.00 కోట్ల మేర చెల్లింపు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
పట్టణ స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో జవసత్వాలు అందిస్తున్నాము…
రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బాద్యతలు చేపట్టినప్పటి నుండి పట్టణ స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించే విధంగా మరియు పూర్తి స్థాయిలో స్వేచ్చను ఇస్తూ నూతన జవసత్వాలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. రాష్ట్ర పురపాల, పట్టణాభివృద్ది శాఖ పరంగా వేలాది కోట్లతో పలు పథకాలను పెద్ద ఎత్తున చేపట్టి అమలు చేయడం జరుగుచున్నదన్నదని ఆయన తెలిపారు. అమృత్ 1.0 పథకం రూ.3,500 కోట్లు, అమృత్ 2.0 పథకం క్రింద రూ.5,000 కోట్లతో పరిపాలనా అనుమతులను ఇప్పటికే జారీచేయడం జరిగిందన్నారు. అదే విధంగా లిక్విడ్ వేస్టు మేనేజ్మెంట్, సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్, ఎస్.టి.పి. నిర్మాణం, బయోమైనింగ్ తదితర పనుల నిర్వహణకై స్వచ్చంధ కార్పొరేషన్ రూ.2 వేల కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న పట్టణ జనాబాకు అనుగుణంగా పలు మౌలిక వసతులను కూడా కల్పించడం జరుగుచున్నదన్నారు. పట్టణ స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో స్వేచ్చ ఇస్తూ నూతన జవసత్వాలు అందించాలనే ఉద్దేశ్యంతో అవసరమైన నిధులను సమకూర్చుకునే విధంగా ఆస్తి మూల ధనం విలువ ఆధారంగా పన్ను విధించే నూతన విదానాన్ని కూడా తమ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. ఫలితంగా ఆస్తి పన్ను రూపేణా 2018-19 వ ఆర్థిక సంవత్సరంలో రూ.1,185 కోట్లు వస్తూళ్లు ఉంటే 2022-23 వ ఆర్థిక సంవత్సరానికి ఆ ఆదాయం రూ.2,000 కోట్లకు పెరిగినట్లు మంత్రి తెలిపారు .
రాష్ట్ర పురపాల, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ పట్ట్టణ స్థానిక సంస్థల్లో స్థానికంగా పనులు నిర్వహణకు సహజంగానే ఎన్నో ఆటంకాలు ఉంటాయని, వాటన్నింటినీ అదిగమిస్తూ పనులను ముందుకు తీసుకుపోయేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలోనున్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో కేవలం 7 స్థానిక సంస్థల్లోనే సమస్యలు ఉన్నాయని, మిగిలిన అన్ని పట్టణ స్థానకి సంస్థల్లో పనులు సజావుగానే సాగుచున్నాయన్నారు. పనులకు సంబందించిన అన్ని పెండింగ్ బిల్లులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. చెల్లింపులు విషయంలో కాంట్రాక్టర్లు ఎవరూ ఇబ్బంది పడటం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లులకు అదనంగా అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి, పునరుద్దరణకు సంబందించిన బిల్లులకు కూడా రూ.187 కోట్లు చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా టిడ్కో హౌసింగ్ బిల్లులకు కూడా చెల్లింపు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది జూలై మాసాంతాని కల్లా 1.50 లక్షల టిడ్కో గృహాలను అందజేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 70 వేల ఇళ్లు ప్రారంభోత్సవాలు కూడా పూర్తయ్యాయని, ఈ నెల 9 న రాష్ట్ర ముఖ్యమంత్రి 8,900 గృహాలను గుడివాడలో ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఆమె తెలిపారు. అన్ని మున్సిఫాలిటీల్లో హెల్త్, శానిటేషన్ బాగా నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని, చిన్న మున్సిఫాలిటీలకు ఇ-ఆటోలు ఇస్తున్నామని, త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ కమిషనర్ కోటేశ్వరరావు ఈ సమవేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News