-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల భాగస్వామ్యంతోనే 3 నుండి 8 ఏళ్ల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలుగుతామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ‘జన్ భాగీధారి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పునాది గట్టిగా ఉంటే ఎలాంటి అభివృద్ధి అయినా సాధించవచ్చన్నారు. పునాది దశలోనే భాష, గణితం వంటి సబ్జెక్టులపై నాణ్యమైన, ఆహ్లాదకరమైన విద్యను అందించినప్పుడే మంచి సమాజాన్ని మనం నిర్మించవచ్చన్నారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి బొమ్మలు, కథలు, వృత్తి నైపుణ్యాలను ఇంటిలోనూ పాఠశాలలలోనూ తప్పనిసరిగా నేర్పించాలన్నారు. చిన్న చిన్న పనులు పిల్లలకు అలవాటు చేయాలని, దానికి తగిన నైపుణ్యాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎన్జీవోలు సరైన శిక్షణ అందించాలన్నారు.
కార్యక్రమానికి ముందు ర్యాలీ ప్రారంభిస్తూ, ఈ నెల పూణెలో జరగనున్న జాతీయ స్థాయి ‘జన్ భాగిధరి’ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రదర్శన ఉంటుందన్నారు.
అనంతరం సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ చదువులో ఎలాంటి సంస్కరణలు వచ్చినా మూలాధారమైన పునాది విద్యను మనం సాధించవచ్చన్నారు. పునాది విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. పిల్లలు నేర్చుకోవడంలో వెనకబడినట్లయితే వారిని గుర్తించి కనీస నైపుణ్యాలు సాధించేలా ప్రజల భాగస్వామ్యంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా విద్య మరింత మెరుగుపడుతుందని అన్నారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారిని సి.వి.రేణుక ‘నిపుణ్ భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ‘నిపుణ్ భారత్’ తెలుగు అనువాద గీతం అందరినీ ఆకట్టుకుంది.
తర్వాత కార్యక్రమంలో ‘విద్యావికాస వేదిక’ వ్యవస్థాపకులు డా. ఎస్.ఆర్.పర్ణి మాట్లాడుతూ పిల్లలకు మాతృభాషతో పాటు ఇతర భాషలు కూడా పరిచయం చేయాలన్నారు. ‘విభా’ సంస్థ ప్రతినిధి వేములపల్లి విజయ్ మాట్లాడుతూ డిజిటల్ విద్యాభ్యాసం ద్వారా పిల్లల్లో నాణ్యమైన విద్యను అందించవచ్చన్నారు.
ఈకార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధులు శేషగిరి మధుసూధన్, డా. గణేశ్ కుమార్ నిగమ్, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, శామో డైరెక్టర్ శ్రీ బి.విజయభాస్కర్, ఎన్టీఆర్ జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి.మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News