గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ ఈ-ఆటోలను రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఉదయం ప్రారంభించనున్నారని, గుంటూరు నగర పాలక సంస్థకు కేటాయించిన ఆటోలను కూడా ప్రారంభోత్సవానికి తీసుకెళ్లాలని సి.డి.యం.ఏ మరియు నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) పి.కోటేశ్వరరావు ఐఏఎస్, నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్ లు తెలిపారు. ఈ-ఆటోల ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రభుత్వం గుంటూరు నగర పాలక సంస్థ కు కేటాయించిన ఆటో లను వెహికల్ షెడ్ నందు అధికారులతో పరిశీలించారు.
ఈ సందర్భంగా సి.డి.యం.ఏ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా రాష్ట్రంలో ఇంటింటి చెత్తను తడి,పొడిగా వేరుగా సేకరణ చేయడానికి 516 ఈ-ఆటోలను ప్రభుత్వం అందించిందని, ఈ-ఆటోలను ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9 గంటలకు తమ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభిస్తారని తెలిపారు. అందులో భాగంగా గుంటూరు నగరానికి 220 ఆటోలను అందించడం జరిగిందన్నారు. సదరు ఆటోలు నగరంలోని 206 వార్డ్ సచివాలయాల వారిగా ఇంటింటి చెత్త సేకరణ చేస్తాయన్నారు. ముఖ్యమంత్రి ఈ-ఆటోలను ప్రారంభించే కార్యక్రమానికి వెళ్లే ఆటోల డ్రైవర్లు తప్పనిసరిగా యునిఫారం ధరించి ఉండాలని, ప్రతి 50 ఆటోలకు ఒక అధికారిని ఇంచార్జి భాద్యతలు కేటాయించాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు.
మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు మాట్లాడుతూ స్వచ్చ ఆంధ్రప్రదేశ్ – స్వచ్చ గుంటూరు సాకారానికి గుంటూరు నగరానికి అధిక సంఖ్యలో ఈ-ఆటోలను కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కి నగర పాలక సంస్థ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ-ఆటోలను గురువారం ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభం చేసిన తర్వాత నగరంలోని వార్డ్ ల వారిగా స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రజారోగ్య కార్మికులకు అందించడం జరుగుతుందన్నారు.
యం.యల్.ఏ మాట్లాడుతూ ఈ-ఆటోల ద్వారా కాలుష్య రహితంగా వ్యర్ధాలను సమర్ధవంతమైన విధానంలో ఇంటింటి సేకరణ చేయడానికి వీలు కల్గుతుందన్నారు. నగరంలోని ఒక్కో సచివాలయానికి ఒక ఈ-ఆటో అందుబాటులోకి రావడం వలన మెరుగైన పారిశుధ్య సాధ్యమవుతుందన్నారు. అలాగే ప్రజలు కూడా తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్ధాలను రోడ్ల మీద వేయకూడదన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పెద్ది రోజ, ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ. కొండారెడ్డి, కార్పొరేటర్ కాండ్రుకుంట గురవయ్య, అధికారులు ఈ-ఆటోల తయారీ కంపెనీ కైనెటిక్ గ్రీన్ ప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News