Breaking News

సహకార వ్యవస్థను బలోపేతంగా తీర్చిదిద్దాలి

-అవసరమైన చోట నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు
-మూడో ఫేజ్ లో ఐ.సి.డి.పి. పనులను మరి కొన్ని జిల్లాలకు విస్తరింపచేయాలి
-రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
క్షేత్ర స్థాయిలో మరింత మెరుగైన సేవలను అందజేసే విధంగా సహకార వ్యవస్థను బలోపేతంగా తీర్చిదిద్దాలని, అందుకు తగ్గట్టుగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పర్చాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర సహకార శాఖ ఉన్నతాధికారులు, అదనపు, జాయింట్, డిప్యూటీ రిజిస్ట్రారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా, డివిజనల్, గ్రామ స్థాయిల్లో సహకార వ్యవస్థను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్ది రైతులకు మెరుగైన సేవలు అందజేయాలన్నారు. రాష్ట్రంలో గల 2,042 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నష్టాల్లో నడుస్తున్న సంఘాలను పునరుద్దరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, పునరుద్దరణకు అవకాశం లేని సంఘాలను లిక్విడేట్ చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. అదే విధంగా అవసరమైన చోట నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణకై రూ.79.72 కోట్లతో చేపట్టబడిన ప్రాజక్టు పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కో-ఆపరేటివ్ డవలెప్మెంట్ ప్రాజక్టు (ఐ.సి.డి.పి.) అమల్లో భాగంగా ఫేజ్-2 లో రూ.609.39 కోట్ల అంచనా వ్యయంతో తూర్పుగోదావరి, కర్నూలు మరియు చిత్తూరు జిల్లాలో చేపట్టిన గోదాములు, కార్యాలయ భవనాల నిర్మాణ పనులను సాద్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. అదే విధంగా ఈ ఐ.సి.డి.పి. క్రింద మూడో ఫేజ్ లో మరి కొన్ని జిల్లాల్లో గోదాములు, కార్యాలయ భవనాల నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. అగ్రికల్చర్ ఇన్ప్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రాజక్టు ఫేజ్-1 & 2 ల్లో రూ.1,661.16 కోట్లతో చేపట్టబడిన మొత్తం 2,405 గోదాముల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. సహకార శాఖ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా 106 ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేయాలని, ఇందుకు సంబందించి జె.సి.ల వద్ద పెండింగ్ లో నున్న ఎన్.ఓ.సి.ల జారీ అంశాన్ని ఒకసారి సమీక్షించాలని రాష్ట్ర సహకార, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ చిరంజీవి చౌధరికి మంత్రి సూచించారు. వీక్ కేటగిరీలో నున్న కాకినాడ, ఏలూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం డి.సి.సి.బి.లను లాభాల బాట పట్టేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పి.ఏ.సి.ఎస్.లు, డి.సి.సి.బి.లు, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు మరియు డి.సి.ఎమ్.ఎస్.ల్లో జరిగిన అవకతవకలు, నిధులు దుర్వినియోగానికి సంబందించిన కేసుల విచారణను వేగవతం చేసి, నిధులను రికవరీ చేయడమే కాకుండా, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు సాద్యమైనంత త్వరగా తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా నిధుల దుర్వినియోగానికి సంబందించి కోర్టుల్లో పెండింగ్ లో నున్న కేసుల తక్షణ పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. సహకార శాఖలో ఖాళీగానున్న పోస్టుల భర్తీ కై అధికారులు చేపట్టిన చర్యలు మరియు పి.ఏ.సి. ఉద్యోగుల హెచ్.ఆర్. పాలసీ అమలుకై తీసుకుంటున్న చర్యలను మంత్రి సమీక్షించారు.
రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ అహ్మద్ బాబు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా సహకార శాఖ ద్వారా అమలు చేయబడుచున్న పలు ప్రాజక్టుల వివరాలు, వాటి ప్రగతి, ఉద్యోగ వ్యవస్థ, హెచ్.ఆర్. పాలసీ అమలు, ఖాళీ పోస్టుల భర్తీకై చేపట్టిన చర్యలు తదితర వివరాలను మంత్రికి వివరించారు.
రాష్ట్ర సహకార, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ చిరంజీవి చౌధరి తోపాటు అదనపు, జాయింట్ మరియు డిప్యుటీ రిజిస్ట్రార్లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *