Breaking News

పేదల కల సాకారమే జగనన్న ధ్యేయం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 246 వ సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, మధ్యతరగతి కుటుంబాలకు నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో భరోసా కల్పిస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దేవీనగర్ లో విస్తృతంగా పర్యటించి 287 గడపలను సందర్శించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును వివరిస్తూ.. ఏ ఇంటికి ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో వివరించారు. కులం, ప్రాంతం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమాన్ని అందజేస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికి చేసి ఆయా పథకాలను అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే జగనన్న సురక్ష క్యాంపుపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సూచించారు.

వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం సందర్శన
పర్యటనలో భాగంగా స్థానిక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మల్లాది విష్ణు సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో అందుతున్న సేవల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశాఖ అందిస్తున్న అన్నీ సేవలను సద్వినియోగపరచుకోవలసిందిగా కోరారు. అదేవిధంగా సిబ్బందితో ముఖాముఖి నిర్వహించిన ఆయన.. ప్రజారోగ్యానికై చేపడుతున్న కార్యక్రమాలపైనా ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, చిల్డ్రన్ వ్యాక్సినేషన్, షుగర్ టెస్టులు, మలేరియా, డెంగ్యూ టెస్టులపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా..? అని వైద్యులతో మాట్లాడారు. ఉదయం 7 గంటల నుంచే అర్బన్ హెల్త్ సెంటర్లో షుగర్ టెస్టులు నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ జలగ
చంద్రబాబు ఛీ అన్న, పో అన్న తెలుగుదేశం చూరు పట్టుకుని వ్రేలాడుతున్న పవన్ కళ్యాణ్ ను మించిన రాజకీయ జలగ దేశంలోనే మరొకరు ఉండరని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న వాలంటీర్ల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా పవన్ మాట్లాడటం దుర్మార్గమన్నారు. గతంలో చంద్రబాబు సైతం వాలంటీర్లను అవహేళన చేస్తూ మాట్లాడి ప్రజాక్షేత్రంలో అభాసుపాలయ్యారని గుర్తుచేశారు. ప్రస్తుతం అదే బాటలో పవన్ కళ్యాణ్ నడుస్తూ.. వాలంటీర్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పైగా బ్రిటీషర్లతో పోలుస్తూ.. వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. పవన్ మాట్లాడుతుంది తప్పు అని ముక్తకంఠంతో రాష్ట్రప్రజలందరూ చెబుతున్నా.. జనసేన అధినేత తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదని మండిపడ్డారు. చూస్తుంటే పవన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందనే అనుమానం కలుగుతోందని మల్లాది విష్ణు అన్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు దుష్టచతుష్టయం నానా తంటాలు పడుతోందని.. ఇందుకోసం మంచి చేస్తున్న ప్రభుత్వంపై మూడువైపుల నుంచి ముప్పేట దాడిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజామద్ధతు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉందని చెప్పారు. సేవాభావంతో పనిచేసే వాలంటీర్ల జోలికొస్తే స‌హించేది లేద‌ని ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు. అనంతరం సచివాలయ పరిధిలో ప్రజలు చూపిన ఆదరాభిమానాలకుగానూ ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సీఎంఓహెచ్ రత్నావళి, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు మార్తి చంద్రమౌళి, అరవింద్, శివ వర్మ, రమేష్, పవన్ కుమార్ రెడ్డి, గోపిశెట్టి శ్రీను, తుంపాల వరప్రసాద్, నారాయణ రెడ్డి, నగర ప్రసాద్, రామకృష్ణ, డి.కృష్ణ, భోగాది మురళి, వీర్రాజు, సాంబశివరావు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *