– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-31 వ డివిజన్ 205 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి నిరుపేద గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 31 వ డివిజన్ 205 వార్డు సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. పసుపుతోటలో విస్తృతంగా పర్యటించి 349 గడపలను సందర్శించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను లబ్ధిదారులకు వివరించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. అది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీసి.. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
సచివాలయ పరిధిలో రూ. 4.14 కోట్ల సంక్షేమం
సచివాలయ పరిధిలో అక్షరాలా 4 కోట్ల 8 లక్షల 61 వేల 149 రూపాయల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వంలో పేదలకు అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. పింఛన్ల రూపంలో 165 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు నాలుగేళ్లలో రూ. 51.60 లక్షల నగదును ఇంటి వద్దకే వెళ్లి వాలంటీర్లు అందించినట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 242 మందికి రూ. 31.46 లక్షలు., ఆసరా ద్వారా 290 మందికి రూ. 29.95 లక్షలు., చేయూత ద్వారా 70 మందికి రూ. 13.12 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 128 మందికి రూ.15.11 లక్షలు., కాపు నేస్తం ద్వారా 8 మందికి రూ.1.20 లక్షలు., జగనన్న తోడు ద్వారా 15 మందికి రూ. 1.50 లక్షలు., వాహనమిత్ర ద్వారా 17 మందికి రూ. 1.70 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందజేసినట్లు వివరించారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 205 మందికి సచివాలయ పరిధిలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు చెప్పారు.
సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు
రాష్ట్రంలో చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తన పర్యటనకు ఎక్కడా ప్రజాదరణ లభించకపోవడంతో, చివరకు సానుభూతి మంత్రాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. శాసనసభకు రాకుండా పారిపోయి.. రోడ్లపై ప్రతిపక్ష నేత చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదని, కేంద్రంపై నోటికొచ్చిన విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడేం ముఖం పెట్టుకుని సీఐబీ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఎక్కడకు వెళ్లిన తెలంగాణ పాట పాడటం జనసేన అధినేతకు సర్వసాధారణమైందని మల్లాది విష్ణు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ఆస్తులపై కనీస అవగాహన కూడా లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కనుక అసందర్భ ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. పవన్ ను కనీసం అసెంబ్లీకి పంపడం కూడా గాజువాక ప్రజలకు ఇష్టం లేదన్న విషయం 2019 ఎన్నికలోనే సుప్పష్టమైందని మల్లాది విష్ణు అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, నాయకులు పెనుమత్స పట్టాభిరామ రాజు, మానం వెంకటేశ్వరరావు, మురళీ కృష్ణంరాజు, బెజ్జం రవి, గుర్రం శ్రీను, నక్కా గోవింద్, అంగిరేకుల విజయ్, అంగిరేకుల సాయి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News