– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-నగర మేయర్, డిప్యూటీ మేయర్ తో కలిసి రూ. 1.59 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజల సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 63 వ డివిజన్లో రూ. 1.59 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలన నియోజకవర్గానికి శాపమని.. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక అభివృద్ధి కార్యక్రమాలపై చక్కని ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ.. డివిజన్ల వారీగా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా ఉడాకాలనీలో రూ. 1.39 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన రహదారులను ప్రారంభించుకోవడంతో పాటు.. EWS కాలనీ 7వ లైన్లో రూ.19.91 లక్షలతో ఇంటర్నల్ క్రాస్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిత్యం జరుగుతున్న అభివృద్ధి పనులతో.. సెంట్రల్ ప్రాంతం అభివృద్ధికి కేరాఫ్ గా మారిందని, ప్రతి డివిజన్లోనూ ప్రభుత్వ ముద్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ప్రధానంగా 63వ డివిజన్ కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.25 కోట్ల వ్యయంతో హోసన్నా మందిరం రోడ్డు., మరో రూ.1.20 కోట్ల వ్యయంతో డాక్టర్స్ కాలనీ రోడ్లను పూర్తిచేసుకున్నట్లు పేర్కొన్నారు. అధికారంలో ఉన్న గత ఐదేళ్లు ఈ పనులన్నీ ఎందుకు చేపట్టలేకపోయారో టీడీపీ, జనసేన నాయకులు సమాధానం చెప్పాలన్నారు. పైగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడానికి గత పాలకులు సిగ్గుపడాలని తెలిపారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గత తెలుగుదేశం హయాంలో నగరంలోని రోడ్లు కనీసం తట్టెడు మట్టికి కూడా నోచుకోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కనుక గత చంద్రబాబు అసమర్థ ప్రభుత్వంలో పడకేసిన పనులకు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థ నాయకత్వంలో శరవేగంగా జరుగుతున్న పనులకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. కార్యక్రమంలో డిఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ మాధవ్, నాయకులు పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, టెక్యం కృష్ణ, సీహెచ్ రవి, తిరుపతిరావు, సూర్యనారాయణ, ఎం.రాజేశ్వరి, పద్మ, నాని, వీఎంసీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News