– యువ క్రీడాకారులు ప్రతిభ ద్వారా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాలి
– క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే ఆడుదాం ఆంధ్రను నిర్వహిస్తున్నాం
– నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్-2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని నేటితరం యువత క్రీడా ప్రతిభ ద్వారా జిల్లాకు మరింత పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని.. జాతీయస్థాయి క్రీడలకు నగరం ఆతిథ్యమివ్వడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ ఇండోర్ స్టేడియంలో ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ (ఏపీటీటీఏ) ఆధ్వర్యంలో నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్-2023ను బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు లాంఛనగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన పీవీ సింధు, కోనేరు హంపి, ఎంఆర్ లలిత్ బాబు, జ్యోతి సురేఖ, బి.ధీరజ్, ఎన్.అనూష వంటి ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభకనబరిచి జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలపటం గర్వకారణమన్నారు. టేబుల్ టెన్నిస్ క్రీడలో కరణం స్ఫూర్తి, శైలు నూర్‌బాషా లు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారన్నారు. నూర్‌బాషా క్రీడాప్రతిభను గుర్తించి ఆమెకు పోస్టల్ డిపార్ట్మెంటులో ఉద్యోగావకాశం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలతో పాటు ఉద్యోగావకాశాలను కల్పిస్తోందన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని యువ క్రీడాకారులు వారి క్రీడా ప్రతిభను చాటిచెప్పేందుకు కృషిచేయాలన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలను నిర్వహించడం ద్వారా క్రీడాకారులను మరింత ప్రోత్సహించి, వారి ప్రతిభాపాటవాలను మరింత పెంచేందుకు ఆయా క్రీడల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్-2023 మెగా క్రీడా ఈవెంట్‌కు జిల్లా ఆతిథ్యమివ్వడం, మునిసిపల్ ఇండోర్ స్టేడియం వేదిక కావడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషిచేసిన భారత్, ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటిచెప్పేందుకు, కొత్త ఛాంపియన్లు అవతరించేందుకు ఇదో గొప్ప వేదిక అని పేర్కొంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఈవెంట్‌కు అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నామని.. ఇంకా ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
వారం రోజుల పాటు ఛాంపియన్షిప్ పోటీలు: ఏపీటీటీఏ ప్రెసిడెంట్ కేవీఎస్ ప్రకాష్‌రావు
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు వారం రోజుల పాటు నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్-2023 పోటీలు జరగనున్నట్లు ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేవీఎస్ ప్రకాష్‌రావు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 1600 మంది క్రీడాకారులకు పైగా ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. యువ క్రీడాకారులు తమ ప్రతిభను చాటిచెప్పేందుకు ఈ పోటీలు అత్యున్నత వేదిక అని పేర్కొన్నారు.
నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్-2023 పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీటీటీఏ ప్రెసిడెంట్ కేవీఎస్ ప్రకాష్‌రావు, టీటీఎఫ్ఐ జనరల్ సెక్రటరీ కమలేష్ మెహతా, విశ్రాంత ఐటీ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారి కేఎస్ రాజేంద్ర కుమార్, ఏపీటీటీఏ వైస్ ప్రెసిడెంట్ వి.భాస్కర్రామ్, టీటీఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ గుణలన్, టీటీఎఫ్ఐ ఛాంపియన్షిప్ మేనేజర్ గణేష్ నీలకంఠం అయ్యర్, ఏపీటీటీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.విశ్వనాథరావు, ట్రెజరర్ పీవీ పాండురంగారావు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ విజయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
అర్జున అవార్డు గ్రహీతలకు సత్కారం
పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు.. ఏపీటీటీఏ, టీటీఎఫ్ఏ ప్రతినిధులు అర్జున అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. అర్జున అవార్డులు పొంది విశిష్ట గుర్తింపు సాధించిన కమలేష్ మెహతా, ఎస్.రామన్, జి.సాతియన్, ఆకుల శ్రీజలను సత్కరించారు.
Prajavartha Online Telugu News