Breaking News

జీఎస్‌టీ సేవా కేంద్రాల‌తో పార‌ద‌ర్శ‌క‌మైన‌, స‌ర‌ళీకృత రిజిస్ట్రేష‌న్ విధానం

– సామాన్య వ్యాపారుల‌కు సైతం ఈ కేంద్రాల‌తో ఎంతో మేలు
– జీఎస్‌టీ సేవా కేంద్రాల‌తో ప‌న్ను చెల్లింపులో అక్ర‌మాల‌కూ అడ్డుక‌ట్ట‌
– రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యాపార వ‌ర్గాల‌కు అత్యంత పార‌ద‌ర్శ‌కమైన, స‌ర‌ళీకృత‌మైన రిజిస్ట్రేష‌న్‌, ప‌న్ను చెల్లింపు విధానాన్ని అందుబాటులో ఉంచ‌డంతో పాటు వ‌స్తు, సేవ‌ల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపులో అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌నే ఉద్దేశంతో జీఎస్‌టీ సేవా కేంద్రాల‌ను ఏర్పాటుచేస్తున్న‌ట్లు రాష్ట్ర ఆర్థిక‌, ప్ర‌ణాళిక‌, వాణిజ్య ప‌న్నులు, నైపుణ్య అభివృద్ధి, శిక్ష‌ణ‌, శాస‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు.
విజ‌య‌వాడ య‌న‌మ‌ల‌కుదురు రోడ్డు, కృష్ణాన‌గ‌ర్‌లోని రాష్ట్ర ప‌న్నుల జాయింట్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో సోమ‌వారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి జీఎస్‌టీ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. వ్యాపార నిర్వ‌హ‌ణ‌లో ప‌న్ను చెల్లింపు అనేది భాగ‌మ‌ని.. అయితే కొంద‌రు న‌కిలీ ఆధార్ కార్డు, గుర్తింపు ప‌త్రాల స‌హాయంతో జీఎస్‌టీ రిజిస్ట్రేష‌న్ చేయించుకొని రెండు మూడేళ్లు ప‌న్ను చెల్లించి ఆ త‌ర్వాత ఎగ‌వేత‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ఎగ‌వేత‌కూ పాల్ప‌డుతున్నార‌ని వీటికి అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు వ్యాపారులు, వినియోగ‌దారులకు మేలు చేకూరేలా అత్యంత స‌ర‌ళ‌మైన, ప‌క‌డ్బందీ విధానాన్ని అమ‌లుచేసేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ జీఎస్‌టీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. ఆధార్, బ‌యోమెట్రిక్ ధ్రువీక‌ర‌ణ ద్వారా చాలా సుల‌భంగా జీఎస్‌టీ రిజిస్ట్రేష‌న్ చేయించుకునేందుకు ఈ కేంద్రాలు వీలుక‌ల్పిస్తాయ‌న్నారు. ప‌న్ను చెల్లింపున‌కు సంబంధించిన ప్ర‌క్రియ‌లో ఉన్న క్లిష్ట‌త‌లు తొల‌గిపోనున్న‌ట్లు తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం వ‌ల్ల స‌మ‌యం కూడా ఆదా అవుతుంద‌ని.. డాక్యుమెంటేష‌న్ త‌నిఖీ ప్ర‌క్రియ కూడా సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌న్నారు. దేశంలో పైల‌ట్ ప్రాజెక్టులో భాగంగా గుజ‌రాత్‌, పుదుచ్చేరిలో ఈ కేంద్రాలు ఉన్నాయ‌ని.. ఇప్పుడు మ‌న రాష్ట్రంలో కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 జీఎస్‌టీ సేవా కేంద్రాలు ప్రారంభ‌మైన‌ట్లు తెలిపారు. సామాన్య వ్యాపారుల‌కు కూడా అనుకూలంగా ఉండేలా ఏదైనా విధానం ఉంటే దాన్ని రాష్ట్రంలో అమ‌లుచేయాల‌న్న ఉద్దేశంతో కేంద్రాన్ని కోర‌డం జ‌రిగింద‌ని.. ఆ మేర‌కు ఇక్క‌డ కూడా జీఎస్‌టీ సేవా కేంద్రాలు ఏర్పాటైన‌ట్లు వివ‌రించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా విజ‌య‌వాడ‌, కృష్ణాన‌గ‌ర్ జీఎస్‌టీ సేవా కేంద్రం సేవ‌ల‌ను చాక్లెట్లు, బిస్క‌ట్లు త‌యారు చేసి అమ్మే భాస్క‌ర్ అనే వ్యాపారి ఉప‌యోగించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఏడాదిన్న‌ర‌గా రాష్ట్రంలోని ప‌న్నుల విభాగంలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన‌ట్లు మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి ఎన్‌.గుల్జార్‌, చీఫ్ క‌మిష‌న‌ర్ ఆఫ్ క‌స్ట‌మ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ (విశాఖ‌ప‌ట్నం) సంజ‌య్ పంత్‌, జీఎస్‌టీఎన్ సీఈవో (న్యూఢిల్లీ) మ‌నీష్ కుమార్ సిన్హా, జీఎస్‌టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (న్యూఢిల్లీ) ధీర‌జ్ ర‌స్తోగి, రాష్ట్ర ప‌న్నుల చీఫ్ క‌మిష‌న‌ర్ ఎం.గిరాజా శంక‌ర్‌, జాయింట్ క‌మిష‌న‌ర్ అభిషిక్త్ కిషోర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *