విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒకే కుటుంబానికి చెందిన ఓట్లను ఒకే పోలింగ్ బూత్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సంక్షిప్త ఓటర్ల జాబితాకు సంబంధించి నమోదవుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని జిల్లా ఇంచార్జ్ , జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతివారం నిర్వహించే సమావేశంలో భాగంగా బుధవారం జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ ఆయన కార్యాలయంలో ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా ఓటర్ల జాబితాపై జరుగుతున్న వివిధ కార్యకలాపాలను వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఓట్లను ఒకే పోలింగ్ బూత్ లో నమోదుచేసేలా ఇప్పటికే బూత్ స్థాయి అధికారులను ఆదేశించామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన నాటినుండి ఇప్పటివరకు నమోదవుతున్నఫామ్ 6,7,8 దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన యువతను ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని 2024 జనవరి 1 నాటికీ 18 సంవత్సరాలు నిండుతున్న వారిని ఓటర్లుగా నమోదుచేస్తున్నామన్నారు. అక్టోబర్ 27వ తేదీన ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన 12,728 ఓటర్లు నమోదుకాగా జిల్లా యంత్రాంగం యువ ఓటర్ల నమోదుపై తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తూ నేటివరకు 22,838 మంది ఓటర్లగా నమోదయ్యారని 2024 అంచనాతో యువ ఓటర్ల జనాభా ఆధారంగా వ్యత్యాసాన్ని పూరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫామ్ 6కు సంబంధించి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో నేటివరకు 1,34,405 దరఖాస్తులు రాగ వాటిలో 1,09,930 పరిష్కరించామని ఇంకను మిగిలి ఉన్న 24,475 దరఖాస్తుల పరిష్కారానికి, ఫామ్ 7కు సంబంధించి 1,20,244 దరఖాస్తులు రాగ వాటిలో 1,03,268 పరిష్కరించామని ఇంకను మిగిలి ఉన్న 16,976 దరఖాస్తుల పరిష్కారానికి, ఫామ్ 8కు సంబంధించి 2,20,555 దరఖాస్తులు రాగ వాటిలో 2,05,057 పరిష్కరించామని ఇంకను మిగిలి ఉన్న 15,468 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారంవారిగా దరఖాస్తుల పరిష్కారంపై ప్రగతి చూపుతున్నామన్నారు. నమోదవుతున్న అన్ని దరఖాస్తులను బిఎల్ఓ లు, ఏఈఆర్వో లు, ఈఆర్వోలు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి విచారణ చేస్తున్నారన్నారు. ఈ నెల 26వ తేదీ నాటికీ అన్ని దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించి జనవరి 1 నాటికీ దోష రహిత ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ కు అందజేయనున్నామని, జనవరి 5, 2024వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించనున్నదని జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ అన్నారు. సమావేశంలో డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వరరావు, ఎఎపి పార్టీ ప్రతినిధి కె. పరమేశ్వరావు, బిజెపి పార్టీ ప్రతినిధి పివి. శ్రీహరి, సిపియం(ఎం) పార్టీ ప్రతినిధి డీవి కృష్ణ , వైఎస్సార్ సీపీ ప్రతినిధి వై. ఆంజనేయరెడ్డి, టిడిపి పార్టీ ప్రతినిధి ఎల్. శివరామప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్ ఉన్నారు.
Prajavartha Online Telugu News