– 2023లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ప్రగతిపథంలో ఎన్‌టీఆర్ జిల్లా
– కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలి.
– మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల్లో ఓటర్ల పూర్తిస్థాయి భాగస్వామ్యం ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు మూలమని.. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునేందుకు వీలుగా కొత్త సంవత్సరంలో నో యువర్ పోలింగ్ స్టేషన్ (Know your Polling Station), నో యువర్ ఓట్ (Know Your Vote) ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. కొత్త సంవత్సరం 2024కు ఆహ్వానం పలుకుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశమందిరంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమల్లో ఎన్టీఆర్ జిల్లా 2023లో ప్రగతిపథంలో పయనించిందని.. 2024లోనూ ఇదే విధంగా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవానికీ సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 సవాళ్లతో కూడుకున్న కార్యక్రమాలు అయినప్పటికీ ప్రభుత్వ మార్గనిర్దేశనం, అధికార యంత్రాంగం సమన్వయంతో మెరుగైన పనితీరు కనబరిచినట్లు వివరించారు. కొత్త సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయని.. అందరి సహకారంతో వీటిని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్ హెల్ప్‌లైన్ ప్లాట్‌ఫారం వంటివాటిపైనా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 2024లో మీడియా మిత్రులందరికీ శుభం జరగాలని.. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు కలెక్టర్ డిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో డీఐపీఆర్‌వో యు.సురేంద్రనాథ్, డీపీఆర్‌వో ఎస్‌వీ మోహనరావు, డివిజనల్ పీఆర్‌వో కె.రవి, పీఆర్‌వో వి.వి.ప్రసాద్, ఐ అండ్ పీఆర్ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News