-తెదేపా కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి
-మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది
ఇబ్రహింపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం సీటు తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి కోరారు. ఇబ్రహింపట్నంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తమకు నమ్మకం ఉందని, ప్రతి బహిరంగ వేదికలలో బీసీలకు న్యాయం చేస్తానని, ఎన్నికల్లో స్థానం కల్పిస్తానని అనేకసార్లు ప్రకటించడంతోనే నేడు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీకి సిద్ధమని, బీసీలకు కేటాయిస్తారన్న సీటు తనకు కేటాయిస్తే గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఓట్లు కలిగి ఉండడంతో వైసీపీ ప్రభుత్వం నేడు ముందుగానే బీసీలకు స్థానం కల్పించిందని గుర్తుచేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా బీసీ తరఫున పోటీ చేయనున్న తనకు అవకాశం కల్పిస్తే అత్యధిక మెజారిటీతో గెలుస్తానని, తనకు బీసీ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ ఓటింగ్ కూడా కలిగి ఉన్నానని ఆ నమ్మకంతోనే నేడు సీటు కేటాయించాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. లేనిపక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల కోరిక మేరకు పోటీకి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News