-డ్వాక్రా మహిళలు మరియు చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులు నేరుగా తయారీ ధరలకే అమ్మకాలు
-మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం డ్వాక్రా బజార్ ప్రారంభ కార్యక్రమంలో సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాలగంగాధరతిలక్ అన్నారు. గుంటూరు లోని మున్సిపల్ హైస్కూలు ఆవరణలో యేర్పాటైన డ్వాక్రా బజార్ స్టాళ్ళ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘాలు పొదుపు కార్యక్రమాలనుంచి ఆర్ధిక శక్తి గా రూపొందాలని తిలక్ కోరారు. ఇందుకు యిటువంటి డ్వాక్రాబజారులు యెంతగానో దోహదపడతాయని అన్నారు. వినియోగదారులకు నేరుగా తమ ఉత్పత్తులు అందించడం వీటి ద్వారా వీలవుతుందని యిందువల్ల మహిళా సంఘాలకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.. గుంటూరు నగర ప్రజలు, సమీప గ్రామాల ప్రజలు డ్వాక్రాబజారు ను సందర్శించి మహిళా సంఘాల, చేతివృత్తుల సంఘాల ఉత్పత్తులను కొనుగోలుచేసి ప్రోత్సహించాలని తిలక్ విజ్ఞప్తి చేశారు.
మరొక ముఖ్య అతిథి గా విచ్చేసిన నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి డా. జి అనిత డ్వాక్రా స్టాళ్ళను ప్రారంభించారు. ప్రతి స్టాలును సందర్శించి ఆయా ఉత్పత్తులను డా. అనిత పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, డ్వాక్రా మహిళల పొదుపు కార్యక్రమాలు, అనంతర దశలో ఆర్ధిక శక్తిగా యెదగడం వంటి అంశాల పై పరిశీలనాత్మక నివేదికలు రూపొందించినట్లు ఆమె తెలిపారు.
అవర్ స్టేట్ అవర్ లీడర్ వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఛైర్మన్ జి. శాంతమూర్తి మాట్లాడుతూ మహిళాసాధికారిత దిశగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును అందుకుని మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలన్నారు. డ్వాక్రా బజార్ నిర్వాహకులు కోట దేవకీ దేవి, పరుచూరి సాయి, చీమకుర్తి ఉమా మహేశ్వర్రావులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాలనుంచి విచ్చేసిన ఉత్పత్తులతో 80 స్టాళ్ళను యేర్పాటు చేసినట్లు తెలిపారు. డ్వాక్రా బజార్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 21 వరకు నెల రోజులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు నిమ్మరాజు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News