విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉగాది ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ సన్నిధిలో సాంస్కృతిక ఉత్సవాలు అపురూపంగా జరుగుతున్నాయి. కళలు, సాహిత్యం, సంగీతం, ఆధ్యాత్మికం అన్నింటినీ మేళవిస్తూ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భక్తుల నుంచి విశేషంగా స్పందన వస్తోంది. శనివారం నాడు కొప్పరపు కవుల దుర్గా ఉపాసన, వారి సాహిత్య, జీవిత వైభవంలో అమ్మవారి ఆశీస్సుల ప్రభావంపై ప్రవచనం ఏర్పాటుచేశారు. కొప్పరపు కవుల మనుమడు చేసిన ఉపన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కొప్పరపు కవులలో పెద్దవారైన వెంకటసుబ్బరాయకవికి ఎదురైన అనుభవాలను ‘దైవసంకల్పం’ కావ్యంగా కొప్పరపు కవులు 1911 ప్రాంతంలో రాశారు. దుర్గాదేవి తేజం, ఆలయ ప్రాభవం, కృష్ణానదీ దర్శనం మొదలైన స్వాభావిక వర్ణనలతో ఈ రచన సాగింది. కొప్పరపు కవులు తమ అవధానాలలో చేసిన అమ్మవారి వర్ణనలను స్పృశిస్తూ మాశర్మ ప్రసంగం నడిపిన తీరు విభిన్నంగా ఆకర్షించింది.కనకాదుర్గాదేవి ఆలయం సర్వ కళలకు,సంస్కృతికి, సారస్వత స్వరూపానికి నిలయంగా భాసిల్లేలా భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలు రచిస్తామని దేవాలయం ఎగ్జిక్యూటివ్ రామారావు తెలిపారు. దేవాలయం తరపున మాశర్మను ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
Prajavartha Online Telugu News