-పార్లమెంటు ఆర్వో మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 కి సంబంధించిన 08 – రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగిందనీ, నోటీసు బోర్డు లో ప్రదర్శించినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. గురువారం కలక్టరేట్ లోని పార్లమెంటు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్, డి ఈ వో కె. మాధవీలత వివరాలు తెలియచేస్తూ, నామినేషన్లు దాఖలు చెసే విధానంలో ఎన్నికల కమిషన్ రూపొందించిన ప్రవర్తనా నియమావళిని పాటించడం జరుగుతుందనీ అన్నారు. మొత్తం ఈ ప్రక్రియను వీడియో రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్ధులు ప్రవేశించే ద్వారాల వద్దా సిసి కెమేరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక నామినేషన్ సెల్ (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేశామన్నారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది. ఏప్రియల్ 21 ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదు.
-అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవొచ్చు అన్నారు. నామినేషన్లను ఆర్ఓ కు గానీ, సంబంధిత ఏఆర్ఓకు మాత్రమే అభ్యర్ది నేరుగా గానీ, తన ప్రపోజర్ ద్వారా గానీ సమర్పించవచ్చు అన్నారు. గరిష్టంగా రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు. నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయి. అభ్యర్ధితో సహా ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్‌లోకి అనుమతించడం జరుగుతుంది.
ఫారమ్-26 ద్వారా అభ్యర్ధులు అఫడవిట్‌ను సమర్పించాలి. నామినేషన్లు వేయడానికి చివరి తేదీ : 25 ఏప్రిల్ 2024 (గురువారం), పరిశీలన తేదీ: 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం), ఉపసంహరణకు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2024 (సోమవారం) అని అదే రోజున పోటిలో ఉండే అభ్యర్థుల వివరాలు ప్రకటించడం జరుగుతుందనీ అన్నారు. పోల్ తేదీ: 13 మే 2024 (సోమవారం) కౌంటింగ్ తేదీ : 04 జూన్ 2024 (మంగళవారం) అని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News