మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం మధ్యాహ్నం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నగరంలోని కలెక్టరేట్లో గల వారి చాంబర్లో ఈవీఎంల ర్యాండమైజేషన్ ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి ర్యాండమైజేషన్ ఇదివరకే పూర్తి చేసి జిల్లా ఎన్నికల యంత్రాంగం సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాలకు వాటిని తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈవీఎంల రెండవ రాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా తొలుత మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు రెండవ రాండమైజేషన్ నిర్వహించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అయిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు,వివి ప్యాట్లు ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు.
అనంతరం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలైన మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెడన, గుడివాడ, గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈవీఎంల రెండవ రాండమైజేషన్ సంబంధిత నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లోని ఈవీఎంలను అక్కడి పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు
రెండవ రాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎంల నంబర్లు ఉండే జాబితాను పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ఈ సందర్భంగా ఎన్నికల విభాగం సిబ్బంది అందజేశారు. రెండవ రాండమైషన్లో నేరుగా చూసిన నంబర్లు, ఇచ్చిన జాబితాలోని నంబర్లు, పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజున ఉంచే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నంబర్లను సరిపోల్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అభ్యర్థులు వారి ఎన్నికల ఏజెంట్లకు సూచించారు. ఈనెల 2వ తేదీ గురువారం అన్ని నియోజకవర్గాల్లోనూ రిటర్నింగ్ అధికారుల వద్ద ఈవీఎంల కమిషనింగ్ జరుగుతుందని, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారికి చెందిన ఎన్నికల ఏజెంట్లు అందులో పాల్గొని ఈవీఎంల సీళ్లపై సంతకాలు చేయాలన్నారు. అందరి సమక్షంలో 1000 ఓట్లు దాకా మాదిరి(మాక్) పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ ప్రక్రియలో మచిలీపట్నం లోకసభ నియోజకవర్గంలో పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు జాన్ కింగ్స్ లే, గన్నవరం గుడివాడ పామర్రు పెనమలూరు శాసనసభ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నరహరి సింగ్ బంగర్, గన్నవరం రిటర్నింగ్ అధికారి సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, అవనిగడ్డ మచిలీపట్నం పామర్రు పెడన గుడివాడ పెనమలూరు రిటర్నింగ్ అధికారులు బాలసుబ్రమణ్యం, ఎం వాణి, శ్రీదేవి, పి వెంకటరమణ, వి పద్మావతి డి రాజు, వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News