– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63 వ డివిజన్ ఉడాకాలనీలో ఎన్నికల ప్రచార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి అనేక కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికీ వైద్యాధికారులను పంపించి వైద్య సేవలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసినట్లు వెల్లడించారు. కనుకనే నీతిఆయోగ్ విడుదల చేస్తున్న ఆరోగ్య సూచీల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. అలాగే ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో., రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలోనూ ఏపీ తొలి స్థానంలో నిలుస్తున్నట్లు తెలిపారు. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదనే తాపత్రయంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఉచిత వైద్య పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,257 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాగా.. అప్పటివరకు కేవలం 748 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీ సేవలను 2,513 ఆస్పత్రులకు విస్తరించడం జరిగిందన్నారు. అలాగే విజయవాడ నగరంలో 29 ఆస్పత్రులలో ప్రస్తుతం పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద రోగులకు ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నట్లు తెలియజేశారు.
పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతిస్తూ..
సెంట్రల్లోని 1,69,376 కుటుంబాలకుగానూ.. 74,585 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. వీరందరికీ గత ఐదేళ్లలో రూ. 170 కోట్ల విలువైన వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా.. 4 నూతన అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. రూ. 1.05 కోట్లతో అయోధ్యనగర్లో., రూ. 1.65 కోట్లతో ఇందిరానాయక్ నగర్, రూ. 1.20 కోట్లతో దేవీనగర్., మరో రూ. కోటి నిధులతో వాంబేకాలనీలో యూపీహెచ్సీలను ప్రారంభించుకున్నట్లు చెప్పారు. వీటిలో 60 రకాల టెస్టులతో పాటు 172 రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం జరుగుతోందన్నారు. హృద్రోగులకు అత్యవసర సమయంలో సేవలందించేందుకు గానూ జీజీహెచ్ లో రూ. 45 వేలు ఖరీదు చేసే స్టెమీ ఇంజక్షన్లను సైతం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను నియోజకవర్గంలో 52,519 మంది సద్వినియోగపరచుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు.
అభాగ్యులకు ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వేలాది కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్లో ఇప్పటివరకు 2,243 మందికి రూ. 12 కోట్ల ఒక లక్షా 46 వేల 91 రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. 211 మందికి రూ. 3 కోట్ల 41 లక్షల 56 వేల 720 రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 15 కోట్ల 77 లక్షల 87 వేల 811 లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. అలాగే ప్రమాదాలు, విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను మానవీయ కోణంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదుకుంటోందని మల్లాది విష్ణు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి నగర్ కు చెందిన చుండూరు వెంకటేశ్వరరావు(44) కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందజేసినట్లు చెప్పారు. సూర్యలంక బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి చనిపోయిన ఆరుగురు యువకుల కుటుంబాలకు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున రూ. 18 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. 58వ డివిజన్ కు చెందిన తోట పవన్ కళ్యాణ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు మద్రాస్ నగరంలో సముద్రంలో మునిగి చనిపోతే.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే రూ. 5 లక్షల ఆర్థిక సాయం కుటుంబానికి అందేలా చూడటం జరిగిందన్నారు. అలాగే విధులు నిర్వహిస్తూ ఎలక్ట్రిక్ షాక్ కు గురై మృతి చెందిన పఠాన్ అయూబ్ ఖాన్, మద్దాలి సాయి లోకేష్ కుటుంబాలకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఆఫ్ ఏపీసీపీడీసీఎల్ తో మాట్లాడి రూ. 5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేయించినట్లు తెలియజేశారు. పేదలు, అభాగ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పునరుద్ఘాటించారు. అటువంటి ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News