-స్పాట్ లోనే ఫార్మ్ 12 ను స్వీకరించి ఓటు హక్కును కల్పించండి
-జిల్లా ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు ఆదేశాలు జారీ చేసిన సీఈఓ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, స్పాట్ లోనే ఫార్మ్ 12 ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం-12ను సకాలంలో సమర్పించలేకపోవడం వల్ల తమ ఓటును వినియోగించుకోలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఏ ఉద్యోగి/ఓటరు ఓటు హక్కును తిరస్కరించరాదని పునరుద్ఘాటించారు.
అనివార్య పరిస్థితుల కారణంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఓటరు 1 మే 2024లోపు ఫారమ్-12ను సమర్పించలేకపోతే, ఏ ఆర్వో పరిధిలో ఆ ఉద్యోగి ఓటరుగా నమోదు అయ్యారో, ఆ ఆర్వో కు ఫార్మ్ 12 సమర్పించేందుకు మరియు ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అనుమతించాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 7 మరియు 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ ఫెసిలిటీషియన్ కేంద్రాలు పని చేస్తాయని ఆయన తెలిపారు. ఉద్యోగులకు మంజూరు చేసిన స్పెషల్ క్యాజువల్ లీవ్ ను సద్వినియోగం చేసుకుంటూ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లో ఓటు హక్కు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అన్నారు.
ECI మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన ఓటర్లందరి ఓటు హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకునేలా ఆర్వోలు అందరూ సహకరించాలని ఆయన ఆదేశించారు. ఓటర్ల వివరాలు, అపాయింట్‌మెంట్ ఆర్డర్ యొక్క నిర్ణీత ధృవీకరణ తర్వాత మరియు పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే జారీ చేయబడలేదని నిర్ధారించుకున్న తదుపరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతించాలని ఆర్వోలకు ఆయన సూచించారు. ECI మార్గదర్శకాల అమల్లో ఏమైనా తేడా వస్తే అందుకు సంబంధిత ఆర్వోలు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అటువంటి అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
Prajavartha Online Telugu News