గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13 జరగనున్న పోలింగ్ కు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు పోలింగ్ రోజుని సెలవురోజులా కాకుండా ఓటు వేయడానికి ప్రత్యేక రోజుగా పరిగణించి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఈ నెల 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు తూర్పు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ఏ సమస్య లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేశామని, వికలాంగుల కోసం ర్యాంప్ లు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బిఎల్ఓల ద్వారా ఓటర్ల స్లిప్ లు పంపిణీ చేయడం జరిగిందని, పోలింగ్ రోజు ఓటరు గుర్తింపు కార్డ్ (ఎపిక్ కార్డ్) తీసురావాలని, ఓటర్ గుర్తింపు కార్డ్ లేకుంటే పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ గుర్తింపు కార్డ్, ఫొటో ఉన్న బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పాన్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్.పి.ఆర్.) పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్.జి.ఐ.) జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఉపాధి హామీ గుర్తింపు కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, ఫొటో ఉన్న పెన్షన్ కార్డ్, ప్రజా ప్రతినిధులకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్ వంటి 11 గుర్తింపు కార్డ్ ల్లో ఏదో ఒకటి పోలింగ్ అధికారులకు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు, టాయ్ లెట్స్, లైటింగ్, టెంట్ లు, కుర్చీలు వంటి మౌలిక వసతులను సంబందిత ప్రాంత ఏఈలు పూర్తి చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోపు పార్టీల కార్యాలయాలు ఉండకూడదన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు అభ్యర్ధుల ప్రచార గడువు ముగిసినందున అభ్యర్ధులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియామావళి మేరకు వ్యవహరించాలని, నిబందనల ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని మొత్తం 255 పోలింగ్ కేంద్రాల్లో 234 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, అందుకు తగిన సిసి కెమెరాలు ఏర్పాట్లు సంబందిత ఏఈలు పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. తూర్పు నియోజకవర్గంలో 2,50,691 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 1,21,849, మహిళలు 1,28,808, ఇతరులు 34 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల విధుల పర్యవేక్షణ, క్షేత్ర స్థాయిలో అధికారుల నుండి అందే ఫిర్యాదులు, సూచనల పర్యవేక్షణకు జిఎంసి ప్రదాన కార్యాలయంలో రిపోర్టింగ్ టీం, స్పెషల్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ సమయంలో ఏ సమస్య ఎదురైనా పరిష్కారానికి క్విక్ రియాక్షన్ టీం ని జిఎంసి ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
Prajavartha Online Telugu News