-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ప్రజలందరి చల్లని దీవెనలతో దిగ్విజయంగా ఐదేళ్ల పాలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2019-24 మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చారిత్రాత్మక విజయంతో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన ఐదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2019లో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని పాదయాత్రలో కలలుకన్నట్లుగానే.. అధికారంలోకి రాగానే వాటన్నింటి సాకారం దిశగా అడుగులు వేసి విజయం సాధించారన్నారు. 99.4 శాతం హామీలను అమలుపరిచి.. మేనిఫెస్టోకు సరికొత్త అర్థాన్ని ఇచ్చారన్నారు. ఏటా సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి మరీ.. చెప్పిన తేదీకే లబ్ధిదారుల ఖాతాలలో నగదును నేరుగా జమ చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ అన్ని వర్గాల ప్రజలకు భరోసాకల్పించారన్నారు. ఇవాళ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలంతా కరోనా సమయంలో ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు అక్షరాల రూ.2.73 లక్షల కోట్ల నగదును డీబీటీ ద్వారా పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. నగదు బదిలీ సహా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలను ఆర్థిక నిపుణులు సైతం కీర్తిస్తున్నారన్నారు. తొలి కేబినెట్ లోనే సామాజిక న్యాయాన్ని పాటిస్తూ.. అన్నికులాలకు న్యాయం చేశారన్నారు. ఇటువంటి నాయకుడే తమకు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలని పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు సహా అన్ని ఉప ఎన్నికలలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారన్నారు.
విశ్వసనీయతకు మారుపేరు
చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలను చూసి.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. ప్రజల ఇంటి వద్దకే పాలనను చేరువ చేస్తూ.. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలకు శ్రీకారం చుట్టారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లోనూ వరుసగా ఐదేళ్లు మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు. నాడు-నేడు ఒక వినూత్న ఆలోచన అని.. నేడు విద్యాలయాలు, ఆస్పత్రులు సర్వాంగసుందరంగా రూపుదిద్దుకున్నాయంటే.. ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. గత పాలకులు ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయలేదో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారత పెద్దపీట వేసి.. సమాజంలో అక్కచెల్లెమ్మలకు ఓ గౌరవాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని మల్లాది విష్ణు అన్నారు. ఐదేళ్లలో డీబీటీ ద్వారా అక్షరాల రూ.1,89,519 కోట్ల లబ్ధి ఆడపడుచులకు చేకూర్చగా.. సెంట్రల్ పరిధిలో రూ.402.46 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఒక్క ఆసరా ద్వారా నియోజకవర్గంలో 3,300 పొదుపు సంఘాల గ్రూపులకు రూ.108 కోట్ల మేలు చేకూర్చినట్లు వివరించారు. ఆరోగ్యశ్రీ సేవలను 1,059 నుంచి 3,257 కి పెంచడంతో పాటు.. ఉచిత వైద్య పరిమితిని రూ. 25 లక్షలకు పెంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా.. బాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీనైనా ప్రారంభించారా..? సమాధానం చెప్పాలన్నారు. గత ఐదేళ్లలో వైద్యశాఖలో 54 వేల పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా మరణాలు తక్కువగా ఉండటానికి ముఖ్యకారణం సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుచూపు అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక అవ్వాతాతలకు ఏ చిన్న కష్టం తెలియకుండా.. ప్రతినెలా 66 లక్షల మందికి రూ.1958.52 కోట్లను పింఛన్ రూపంలో ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకునే ఏ నిర్ణయమైనా.. లక్షలాది మందికి న్యాయం చేకూర్చేలా ఉంటుందని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా వారి అభ్యున్నతికి అడుగులు వేసినట్లు చెప్పారు. కనుకనే ఈ సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగిందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అన్నివర్గాల ప్రజలు ముందుకువచ్చారని చెప్పుకొచ్చారు. ప్రజలందరి చల్లని దీవెనలతో మరోసారి మన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని.. అందరం కలిసికట్టుగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మరిన్ని అడుగులు ముందుకు వేద్దామని తెలియజేశారు.
Prajavartha Online Telugu News