Breaking News

గేమింగ్ జోన్స్‌, ఎగ్జిబిష‌న్ల‌లో పూర్తి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందే

– నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు
– జిల్లాస్థాయి క‌మిటీ ఆధ్వ‌ర్యంలో విస్తృత త‌నిఖీలు
– నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో మాక్‌డ్రిల్స్ నిర్వ‌హ‌ణ‌
– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లా ప‌రిధిలో విజ‌య‌వాడ‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని గేమింగ్ జోన్స్‌, ఎగ్జిబిష‌న్లు త‌దిత‌రాలు అగ్ని ప్ర‌మాదాలు వంటి విప‌త్తులు సంభ‌వించ‌కుండా నిబంధ‌న‌ల మేర‌కు పూర్తిస్థాయిలో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందేన‌ని.. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు హెచ్చ‌రించారు.
గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 25న ఓ గేమింగ్ జోన్‌లో జ‌రిగిన ఘోర అగ్నిప్ర‌మాదంలో అనేక మంది మ‌ర‌ణించారు. ఈ నేప‌థ్యంలో జిల్లాలోని ప‌రిస్థితుల‌ను స‌మీక్షించ‌డంతో పాటు గేమింగ్ జోన్స్‌, ఎగ్జిబిష‌న్స్‌, విద్యా సంస్థ‌లు, షాపింగ్ మాల్స్‌, ఆసుప‌త్రులు, మ‌ల్టీప్లెక్స్‌లు త‌దిత‌రాల్లో అగ్ని ప్ర‌మాదాలు జ‌ర‌క్కుండా చేసిన ఏర్పాట్లు, జిల్లాస్థాయి క‌మిటీ ఆధ్వ‌ర్యంలో విస్తృత త‌నిఖీలు, గుర్తించిన అంశాల‌తో నివేదిక‌ల రూప‌క‌ల్ప‌న‌, లోపాలు ఏవైనా ఉంటే యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌రిదిద్దుకునేలా చ‌ర్య‌లు తీసుకునేందుకు అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణ త‌దిత‌రాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి గురువారం క్యాంపు కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అగ్నిమాప‌క‌, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, మునిసిప‌ల్‌, పంచాయ‌తీరాజ్, విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ భ‌వంతుల్లో అగ్ని ప్ర‌మాదాలు సంభ‌వించ‌కుండా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ఒక‌వేళ ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే త‌క్ష‌ణ స్పంద‌న ప్ర‌ణాళికను అమ‌లుచేయ‌గ‌లిగే సామ‌ర్థ్యాన్ని పెంపొందించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రెవెన్యూ, పోలీస్‌, మునిసిప‌ల్‌, పంచాయ‌తీరాజ్‌, విద్యుత్‌, ఆర్ అండ్ బీ, అగ్నిమాప‌క త‌దిత‌ర శాఖ‌ల అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి క‌మిటీ జిల్లా క‌లెక్ట‌ర్ మార్గ‌నిర్దేశ‌నంతో విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టి.. నివేదిక‌లు స‌మ‌ర్పించాల‌న్నారు. స‌రైన ప్ర‌ణాళిక ప్ర‌కారం అమ్యూజ్‌మెంట్ పార్కులు, గేమింగ్ జోన్స్‌, ఎగ్జిబిష‌న్ల‌తో పాటు విద్యా సంస్థ‌లు, ఆసుప‌త్రులు, థియేట‌ర్లు త‌దిత‌రాల్లో త‌నిఖీలు చేప‌ట్టాల‌న్నారు. నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వ‌హించాల‌ని సూచించారు. వాణిజ్య భ‌వంతుల్లో అగ్ని ప్ర‌మాదాల భ‌ద్ర‌తా ప‌రిక‌రాలను 100 శాతం ఉండేలా చూడ‌టంతో పాటు వాటిని స‌రిగా వినియోగించ‌డంపై సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు. అలార‌మ్ సిస్ట‌మ్ , ప‌బ్లిక్ అడ్రెసింగ్ సిస్ట‌మ్‌, సూచికలు, స‌రైన విధంగా ఎగ్జిట్ ఏర్పాటు త‌దిత‌ర ప్యాసివ్ ఫైర్ ప్రొటెక్ష‌న్ చ‌ర్య‌ల‌పైనా దృష్టిసారించేలా చూడాల‌న్నారు. ముఖ్యంగా సెంట్ర‌లైజ్డ్ ఏసీ ఉన్న భ‌వంతులపై దృష్టిసారించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు. స‌మావేశంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, నందిగామ ఆర్‌డీవో ఎ.ర‌వీంద్ర‌రావు, తిరువూరు ఆర్‌డీవో కె.మాధ‌వి, జిల్లా అగ్నిమాప‌క అధికారి ఏవీ శంక‌ర‌రావు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *