విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
06-07-2023 తేది శనివారం ప్రపంచ జునోసిస్ దినం సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ, పశుసంవర్ధక శాఖ, ఎన్టీఆర్ జిల్లా, జీవకారుణ్య సంస్థ, భవానీపురం మరియు సాయి బాబా సత్సంగ సేవ సమితి వారి సంయుక్త నిర్వహణలో 492 వీధి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు చేయడం జరిగినది. కొత్తపేట నెహ్రుబొమ్మ సెంటరు మరియు భవానీపురం ఐరన్ యార్డులోని జీవకారుణ్య సంస్థ వద్ద ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ (హెల్త్), డా. పి.రత్నావళి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశు పక్ష్యాదుల నుండి మనుషులకు అలాగే మనుషుల నుండి జంతువులకు సహజంగా వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు లేదా సంక్రమిత వ్యాధులు అంటారు. మనకు ఎంతో ఇష్టమైన కుక్కల నుండి రేబిస్ వ్యాధి, లెప్టోస్పైరోసిస్, పాడి పశువుల నుండి క్షయ, బ్లూ సెల్లోసిస్, గొర్రె, మేకల నుండి ఆంత్రాక్స్ మరియు కోళ్ల నుండి వచ్చే బర్డ్ ఫ్లూ వ్యాధి మొదలగునవి జూనోటిక్ వ్యాధులలో ముఖ్యమైనవి. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ప్రాణాంతక వ్యాధులైన ర్యాబిస్, ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ర్యాబిస్ వ్యాక్సిన్ మొట్ట మొదటిగా 1885లో జులై 6న లూయిస్ పాశ్చర్ సైంటిస్ట్ మనుషుల్లో తొమ్మిదేళ్ల బాలుడిపై ప్రయోగించి ఘన విజయం సాధించారని సర్కిల్ -1 అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ (హెల్త్), డా. సురేష్ బాబు గారు తెలియచేశారు. ఆంత్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. అనంతరం పెంపుడు కుక్కలకు వ్యాధి నివారణ టీకాలను వేశారు. 53 వ డివిజన్ కార్పొరేటర్, శ్రీ అప్పాజీ గారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహరించాలో మరియు ర్యాబిస్ పై అవగాహనా పెంచుకోవడం తెలుగులో అందరికి తెలియచేసే విధంగా విజయవాడ నగరపాలక సంస్థ వారు తయారు చేసిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యానిమల్ హెల్త్-వన్ హెల్త్, ప్రోగ్రాం ఆఫీసర్ , డా. C.రమ్య గారు, 53 వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్, G.శ్రీనివాస్ గారు, సాయి బాబా సత్సంగ సేవ సమితి తరపున శ్రీ మేకా.కృష్ణ శేఖర్ గారు, జీవకారుణ్య సంస్థ, భవానీపురం చైర్మన్, శ్రీ మురాల .వెంకటేశ్వర రావు గారు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.బి .సోమ శేఖర్ రెడ్డి తెలిపారు.
Prajavartha Online Telugu News