విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంతో కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం-రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యములో ఏపి రాష్ట్ర పద్మశాలీయుల ఆత్మీయ సమావేశం ఆగష్టు 11న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని ఆహ్వాన కమిటీ ఛైర్మన్ జి.వి.నాగేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆత్మీయ సమావేశం పోస్టర్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తి అయిన చేనేత పరిశ్రమ నానాటికి దిగజారిపోతుంది. మార్కెట్లో నూలు, రంగులు కొనుగోలు, వస్త్ర ఉత్పత్తి చేయటం, ఆ వస్త్రాలను మార్కెట్లో విక్రయించటం లాంటి ప్రక్రియ మన చేనేత సంఘాలకు ప్రస్తుత రోజులలో కష్టతరంగా మారిందన్నారు. చేనేత రకాలను పవర్ లూమ్, మిల్లులో తయారు చేయటం వలన పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. అలాగే సభకు రాజకీయ పక్షాల నాయకులు, జాతీయస్థాయి పద్మశాలీయుల నాయకులు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పద్మశాలీయ కుల బంధువులు ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. పద్మశాలీయులను చైతన్యవంతుల్ని చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాలలో రాణించేలా తీర్చిదిద్దటమే ఈ సమావేశం ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పెద్దలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కె.లక్ష్మీనారాయణ, వి.నరసింహులు, బి.వెంకట సుబ్బయ్య, బి.రాధాకృష్ణయ్య, బి.పరమేశ్వరరావు, ఎ.జగదీష్, జి. ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News