-సీఎం నివాసంలో జరిగిన టిడిపి పార్లమెంటరీ సమావేశం
-ఢిల్లీ వేదికగా జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాము
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని వివిధ మంత్రితత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన పలు పథకాలు, నిధుల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఎంపిలు, రాష్ట్ర మంత్రులు కలిసి పనిచేసే విధంగా రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అద్బుత ప్రయోగమని..మంచి సత్ఫలితాలను ఇస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఉండవల్లి లోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో శనివారం జరిగిన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత టిడిపి ఎంపిలందరిపైన వుందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పథకాలు, నిధులు రాష్ట్రంలోని ఆ శాఖ మంత్రలతో సమన్వయం చేసుకుంటూ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదే విధంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు చెప్పారు. గత ప్రభుత్వానికి పరిపాలన అనుభవం లేకపోవటం వల్ల కేంద్రం ఇచ్చిన ఏన్నో పథకాల నిధులు దుర్వినియోగం జరిగిందన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఆ బాధలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యమిస్తుందన్నారు. ఢిల్లీ వేదికగానే జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైసిపి చేస్తున్న రాజకీయ హత్యల్లో టీడీపీ నేతలే బాధితులుగా వున్నారని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
Prajavartha Online Telugu News