Breaking News

రైతును ఆర్థికంగా నిలబెట్టే ఆయిల్ పామ్ సాగు .. జిల్లా కలెక్టర్

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయిల్ పామ్ తోటల సాగు రైతును ఆర్థికంగా నిలబెడుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందగలిగే ఆయిల్ పామ్ సాగు పట్ల రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం మధ్యాహ్నం పామర్రు ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై గ్రామస్థాయి ఉద్యాన, వ్యవసాయ శాఖల సహాయ సిబ్బందికి, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయిల్ పామ్ సాగు విధానం, సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రాయితీల వివరాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో అధిక శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, రైతులకు అధిక లాభాలను తెచ్చిపెట్టే పంటలను సాగు చేసే విధంగా కృషి చేయాలని ఉద్యాన అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు.

ఆయిల్ పామ్ సాగు వివరాలను ఆయన తెలియజేస్తూ సాగు చేపట్టే రైతులకు హెక్టారుకు 143 మొక్కలను వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. సాధారణంగా ఒక్కొక్క మొక్క ధర రూ.193 ఉంటుందని, రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి సబ్సిడీతో ఉచితంగా మొక్కలను అందిస్తుందన్నారు. అదేవిధంగా సూక్ష్మ సేద్యం పద్ధతిపై సాగు చేపట్టే రైతులకు 50 శాతం రాయితీతో డ్రిప్పర్స్, జెట్ పరికరాలను అందిస్తామని అన్నారు.

పంట అయిదవ సంవత్సరం నుంచి చేతికి వస్తుందని, ఆ లోపుగా మొదటి నాలుగు సంవత్సరాల వరకు మొక్కలకు ఎరువుల యాజమాన్యం, అంతర పంటల సాగు నిమిత్తం సంవత్సరానికి ఒక హెక్టారుకు రూ.5,625 రైతులకు అందించడం జరుగుతుందన్నారు. మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలు సాగు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు అన్నారు. ఒకసారి నాటిన మొక్కలతో 40 సంవత్సరాల వరకు 15 రోజులకు ఒకసారి పంటను కోస్తూ నిరంతర ఆదాయాన్ని పొందవచ్చని, ఖర్చులు పోను హెక్టారులో పంటకు 50 నుంచి 60 వేల రూపాయల వరకు నికర ఆదాయాన్ని రైతులు పొందవచ్చు అన్నారు. ఆయిల్ పామ్ చట్టం అనేది ఉందని, దాని ప్రకారం మార్కెట్లో ధరను నిర్ణయించడం, వివిధ కంపెనీల అంగీకారంతో రైతులకు మొక్కలను సరఫరా చేయడం, పంటను కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో ఎంపీపీ అశోక్ కుమార్, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిడి విజయలక్ష్మి, పతాంజలి ఫుడ్స్, 3ఎఫ్ కంపెనీల ప్రతినిధులు చంద్రబాబు, శరత్, ఎంపీడీవో మద్దిపట్ల భారతి, తహసిల్దార్ పల్లవి, ఉద్యానవన అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *