మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఖనిజ ఫౌండేషన్స్ ట్రస్ట్ (డీ ఎం ఎఫ్ టీ) నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా ఖనిజ ఫౌండేషన్స్ ట్రస్ట్ నిధుల వినియోగంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డీ ఎం ఎఫ్ టీ నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, అందుకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు ఇంకా మొదలుకాని పనులకు టెండర్ ప్రక్రియ మొదలు పెట్టి పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు ఏ ఏ పనులు పూర్తయ్యాయి, టెండర్లు పిలిచి పెండింగ్ లో ఉన్న పనుల వివరాలు, టెండర్లు పిలవాల్సిన పనులు, బిల్లుల చెల్లింపు తదితర వివరాలను నిర్దేశిత ప్రొఫార్మాలో శాఖల వారీగా రిపోర్టును సమర్పించాలన్నారు. పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే రూపొందించి ఆలస్యం చేయకుండా సకాలంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ఈ విజయ కుమారి, ఇరిగేషన్ డ్రైనేజ్ ఈఈ విజయలక్ష్మి, ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావు, భూగర్భ గనుల శాఖ సూపరింటెండెంట్ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News