-వరద ప్రభావం పడిన ప్రతి బాధితున్నీ ఆదుకుంటాం
-అత్యంత పారదర్శకంగా నష్ట వివరాల నమోదు
-డేటా రీవెరిఫికేషన్‌తో పాటు సూపర్వైజరీ చెక్ ప్రక్రియనూ చేపడుతున్నాం
-రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రభావంపడిన ప్రాంతాల్లో చివరి మైలు వరకు న్యాయం చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని.. ప్రతి బాధితునికీ అండగా నిలిచేందుకు చేస్తున్న కృషిలో భాగంగా అత్యంత పారదర్శకంగా నష్ట వివరాల నమోదుతో నివేదికలను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ అన్నారు.
పొరపాట్లకు తావులేకుండా నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనలో భాగంగా చేపడుతున్న రీవెరిఫికేషన్, సూపర్వైజరీ చెక్‌తో పాటు ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న వార్డు సచివాలయాల పరిధిలో డేటా క్రాస్ చెక్ ప్రక్రియపై మంత్రి నారాయణ అధ్యక్షతన ఆదివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశాలు జరిగాయి. తొలుత ప్రత్యేక అధికారులతోనూ తర్వాత ఎన్యూమరేషన్ బృందాలతోనూ సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ డైరెక్టర్ ఎం.హరినారాయణన్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర తదితరులు హాజరైన ఈ సమావేశాల్లో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనపై చర్చించారు. రీవెరిఫికేషన్, సూపర్చెక్కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి నారాయణ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
రీవెరిఫికేషన్కూ అత్యంత ప్రాధాన్యం:
ముంపు ప్రభావం పడిన ప్రతి ఇంటినీ సందర్శించి, నష్ట నమోదు చేయడం జరిగిందని.. విజయవాడ అర్బన్ పరిధిలో 4,036 మంది ఎన్యూమరేటర్లతో దాదాపు 1,75,000 గృహాలకు సంబంధించి ఎన్యూమరేషన్ చేయడం జరిగిందని.. అయితే ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా నివేదికలు రూపొందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో రీవెరిఫికేషన్ ప్రక్రియకూ అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకోవాలనే ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిబద్ధతతో కృషిచేయాలని సూచించారు.
గ్రౌండ్లోకి నీళ్లువచ్చిన అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి అంతస్తులోని కుటుంబాలను కూడా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందన్నారు. కింద నీళ్లు రావడంతో పైఅంతస్తుల్లో ఉన్నవారు సైతం ఇబ్బందికి గురయ్యారని, జీవనోపాధి దెబ్బతిందని, ఇలాంటి వారికి కూడా తగిన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. రీవెరిఫికేషన్, సూపర్వైజరీ చెక్ ప్రక్రియలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది సందేహాలను మంత్రి నారాయణతో పాటు పురపాలక శాఖ డైరెక్టర్ ఎం.హరినారాయణన్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన నివృత్తి చేశారు.
సమావేశంలో విజయవాడ ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేవీ సత్యవతి, వార్డు ప్రత్యేక అధికారులు, ఎన్యూమరేటర్ బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News