గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్ ద్వారా వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్లు వెంటనే పనులను వేగంగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్గారు కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. బుధవారం కాంట్రాక్టర్లు క్షేత్ర స్థాయిలో తమ సమస్యలపై కమిషనర్ ని చాంబర్ లో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ల వారీగా టెండర్ పొందిన పనులు, పెండింగ్ పనులను కాంట్రాక్టర్లు వెంటనే చేపట్టాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రతి పని నేరుగా తనిఖీ చేసిన అనంతరమే బిల్లుల చెల్లింపు చేస్తామన్నారు. కొందరు కాంట్రాక్టర్లు తమ చేయగలిగిన స్థాయికి మించి కాంట్రాక్ట్ లు పొంది, పనులను అసంపూర్తిగా చేస్తున్నారని, అటువంటి వారు తొలుత పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే అనేక పనులను నేరుగా తనిఖీ చేయగా నాణ్యతలో పలు లోపాలను గుర్తించామన్నారు. అభివృద్ధి పనులను నగరంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిల్లులను వర్క్ సీనియారిటీ మేరకు వరుసగా చేస్తామని, అలాగే కాంట్రాక్టర్స్ కి అత్యవసర పరిస్తితులు తమ దృష్టికి తెస్తే సదరు బిల్స్ చెల్లింపుకు వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, ప్యాచ్ వర్క్ లను కూడా ఎప్పటికప్పుడు వేగంగా చేయాలన్నారు. కాంట్రాక్టర్లు క్షేత్ర స్థాయిలో తాము ఎదుర్కొనే సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని, వచ్చే శుక్రవారం కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు తమ దృష్టికి తెచ్చిన అంశాలను, శుక్రవారం జరిగే సమావేశంలో అధికారులు, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొండా రమేష్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ బిగ్ కెపాసిటిని జిఎంసి అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ లు పొందేందుకు అమలు చేయాలని కోరారు. లేకుంటే ఒకే కాంట్రాక్టర్ పేరుమీద తన పరిధికి మించి 20 నుండి 30 వర్క్ లు ఉంటున్నాయన్నారు. ఇప్పటి వరకు చేసిన వర్క్ లకు పేమెంట్ షెడ్యుల్ ఇవ్వాలని కోరారు.
Prajavartha Online Telugu News