-అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు
-సచివాలయాల ఆకస్మిక తనిఖీల్లో కార్యదర్శుల పనితీరు పై కమిషనర్ ఆగ్రహం
-విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై చర్యలు తప్పవు
-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తూ, పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ శ్యామల నగర్ లోని 99, 100, 101, 102, 103, 104 వార్డ్ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు.
కమిషనర్ గారు తొలుత హాజరు రిజిస్టర్లు తనిఖీ చేసి సచివాలయ కార్యదర్శుల హాజరు సక్రమంగా లేకపోవడం, పని వేళల్లో మూవ్మెంట్ రిజిస్ట్రర్ లో నోట్ చేయకుండా వెళ్ళడం గమనించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి వార్డ్ సచివాలయాలు ఆకస్మిక తనిఖీలు చేస్తామని, కార్యదర్శులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించకుంటే చర్యలు తప్పవన్నారు. కార్యదర్శులు స్థానిక సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి సచివాలయం పరిధిలోనే చర్యలు తీసుకోవాలని, అప్పుడే సిబ్బంది స్థానికులకు సత్సంబంధాలు ఉంటాయన్నారు. అలాగే ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు సచివాలయంలో కార్యదర్శులు అందరూ అందుబాటులో ఉండి, ప్రజల నుండి అందే ఆర్జీలను తీసుకోవాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ప్రజల సర్వీస్ రిక్వస్ట్ లు పెరగాలన్నారు. వివిధ ప్రభుత్వ సర్వీసులు, సర్వేలు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సచివాలయం పరిధిలో ఇంటి, కుళాయి పన్నులను నూరు శాతం వసూళ్లు చేయడంలో కార్యదర్శులు సంయుక్త కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యదర్శి తమ విభాగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని తెలిపారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు, నోడల్ అధికారి లీలారాణి, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News