– ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తను చేయాలన్నదే లక్ష్యం
– స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
– ఇప్పటికే విజయ పథంలో పయనిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకోవాలి
– ఆలోచనకు ఆశయం తోడైతే పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు అవకాశం
– ప్రతి పారిశ్రామికవేత్తా పది మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి
– స్వర్ణాంధ్ర @ 2047, పీ-4 అమల్లో జిల్లాను అగ్రగామిగా, ఆదర్శవంతంగా నిలుపుదాం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రగతి పథంలో పయనింపజేసేందుకు, పెద్దఎత్తున పెట్టుబడులను, వ్యవస్థాపకతను, ఉపాధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతతో ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని గొప్ప ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నామని, ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదంతో పారిశ్రామిక ప్రగతి సాధిద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
శుక్రవారం విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్తపై ఏర్పాటుచేసిన కార్యశాలను కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. మహిళల సారథ్యంలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న వివిధ సంస్థలు ఏర్పాటుచేసిన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఓ చిన్న ఆలోచనను గొప్ప ప్రాజెక్టుగా మలిచి విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్దడంలో మహిళా పారిశ్రామికవేత్తల అసోసియేషన్ (ఏఎల్ఈఏపీ) పోషిస్తున్న కీలకపాత్రను అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఇప్పటికే పరిశ్రమలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలను వివరిస్తూ భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలను చేయిపట్టి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పునర్భవ శక్తివేల్ (పునర్భవ సస్టైనబుల్ ప్రొడక్ట్స్), సీహెచ్ జితేంద్రియ (ఆకృతి బయోగ్రీన్), కీర్తన (9 నట్జ్), మాధురి (శ్రీ శ్యామలాంబ ఫుడ్ ప్రొడక్ట్స్), శ్రీకాంత్ (శ్రీకాంత్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్), నవీన్ (ట్విల్స్), డి.విజయదుర్గ (శ్రీ సహస్ర ఇండస్ట్రీస్), పార్వతి (మన అర్బన్ బౌల్).. స్వయం సహాయక సంఘాల మహిళలకు విలువైన సూచనలు ఇచ్చారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా పారిశ్రామికవేత్తగా ఎదిగి తనతో పాటు మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పం, ఆలోచనకు ఆశయం తోడైతే విజయవంతంగా ముందుకెళ్లొచ్చని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేశారు.
పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా..
కార్యశాల ఉద్దేశాన్ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మీడియాకు వివరించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధికి, పేదరికం లేని రాష్ట్ర ఆవిష్కరణకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిందని.. ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాస్థాయిలో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నామని, ఇందులోభాగంగా గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలను ఇప్పటికే విజయవంతంగా పారిశ్రామిక యూనిట్లను నిర్వహిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలను ఒకేవేదికపైకి తీసుకొచ్చేందుకు వర్క్‌షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తున్న వారికి, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ వర్క్‌షాప్ మంచి వేదికగా నిలిచిందన్నారు. ఒక మంచి ఆలోచనను వ్యాపార నమూనాగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న పథకాలు, బ్యాంక్ లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకోవడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఆన్‌లైన్ మార్కెటింగ్ వంటి అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలను అందిపుచ్చుకోవడం వంటివాటిని ఈ కార్యశాలలో జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించడం జరిగిందన్నారు. ఈ ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 855 కోట్ల మేర జీవనోపాధి రుణాలు మంజూరు జరుగుతున్నందున వాటిని సద్వినియోగం చేసుకునేలా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా జిల్లా అధికార యంత్రాంగం.. పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని దాదాపు 4.50 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకూ అవగాహనకల్పించడం జరుగుతుందని.. ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
2047 నాటికి రూ. 55 లక్షల తలసరి ఆదాయం లక్ష్యం:
2024-25లో ఎన్‌టీఆర్ జిల్లా తలసరి ఆదాయం రూ. 2.52 లక్షలుగా ఉందని.. 2047 నాటికి రూ. 55 లక్షల తలసరి ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త సాకారానికి కృషిచేయాల్సిన అవసరముందన్నారు. వయసు, విద్యార్హతలతో సంబంధం లేకుండా ఆలోచన, ఆశయంతో పాటు కష్టపడే మనస్తత్వం ఉన్న వారందరికీ ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం, అధునాతన శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. రూ. 2 లక్షల పెట్టుబడితో కోట్లాది రూపాయల టర్నోవర్‌తో ముందుకెళ్తున్న మహిళా పారిశ్రామికవేత్తలను ఆదర్శకంగా తీసుకోవాలని సూచించారు. ఎన్‌టీఆర్ జిల్లా స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో సేవా రంగం వాటా 2024-25లో దాదాపు 68 శాతంగా ఉందని.. ఈ నేపథ్యంలో సేవారంగంలో పారిశ్రామిక అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కృషిచేయడం జరుగుతోందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకట నారాయణ, జిల్లా గ్రామీణ సమాఖ్య అధ్యక్షులు కల్పన, అర్బన్ సమాఖ్య అధ్యక్షులు మీనాక్షి, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సారథి కనకదుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News