గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుకోవాడానికి, ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించేలా 57 ఎన్నికల వార్డ్ ల్లో, ఒక్కో వార్డ్ కు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ కి భాధ్యతలు కేటాయిస్తున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య విభాగ పనితీరులో మార్పు రావాలని, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ సులభంగా, ప్రజలకు జవాబుదారిగా ఉండేందుకు శానిటరీ ఇన్స్పెక్టర్లను ఎలక్షన్ వార్డ్ కు ఒకరిని కేటాయిస్తున్నామని తెలిపారు. వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శుల ద్వారా ఎన్నికల వార్డ్ ల వారీగా ప్రస్తుతం ఉన్న ఇళ్ల సంఖ్యను తీసుకొని, ఈ నెల 15 నుండి అమలు జరిగేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు. త్వరలో ఇంటింటికి స్కానర్ లు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేస్తామని తెలిపారు. తద్వారా ఏ ప్రాంతంలో ఇంటింటి చెత్త సేకరణ జరగలేదు వంటి సమస్యలు తేలుస్తాయన్నారు. మలేరియా కార్మికులను కూడా ఇక నుండి శానిటరీ ఇన్స్పెక్టర్ల పరిధిలోనే పని చేస్తారన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా డి&ఓ ట్రేడ్ లైసెన్స్లు ఉండాల్సిన సంఖ్య కన్నా తక్కువగా ఉన్నాయని, నూతనంగా శానిటరీ డివిజన్ల పునర్విభజన చేసినందున ఇన్స్పెక్టర్లు తమ డివిజన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లైసెన్స్ లు, రెన్యువల్ చేసుకున్నవి, నూతనంగా తీసుకోవాల్సి ఉండి తీసుకోకుండా ఉన్న వివరాలతో ఏ రోజుకి ఆరోజు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని, నగరంలోని కమర్షియల్ సంస్థలు తప్పనిసరిగా సంస్థ ఏర్పాటు చేసిన నాటి నుండే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని స్పష్టం చేశారు. జనన,మరణ ధృవ పత్రాల నమోదుపై ఇన్స్పెక్టర్లపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సమావేశంలో సిఎంఓహెచ్ఓ డాక్టర్ పిజె అమృతం, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, బయాలజిస్ట్ రామారావు, శానిటరీ సూపర్వైజర్లు ఆయుబ్ ఖాన్, సోమశేఖర్, ప్రసాద్, ప్రజారోగ్య విభాగ సూపరిండెంట్ పోలేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News