Breaking News

‘స్వర్ణ కడప’ స్థాపన అందరి బాధ్యత..!

-రాష్ట్ర వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత
-ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి పాటుపడతాం

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణ కడప ఆవిష్కరణ బాధ్యత అందరిదీ అని, ఇందుకోసం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజిక వేత్తలు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో.. స్వర్ణాంధ్ర పి4 ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ చైర్మన్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత అధ్యక్షతన జిల్లాలో “స్వర్ణాంధ్ర – పీ4 ఫౌండేషన్” అమలుపై జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత మాట్లాడుతూ… జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు. అందుకు అనుగుణంగా.. అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. పారదర్శకత, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా నడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రజలకు ఒక జవాబుదారీతనంతో సుపరిపాలన అందిస్తూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనకు పి4 ఫౌండేషన్ ద్వారా “బంగారు కుటుంబం-మార్గదర్శి” విధానాన్ని మాలుచేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల కోసం ప్రభుత్వం పని చేస్తోందని.. జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు పారదర్శక పాలనను అందించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని అందుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం దిశగా వైఎస్ఆర్ కడప జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేద్దామన్నారు.

రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షించే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్వర్ణాంధ్ర @2047 లక్ష్యంగా విజన్ రూపొందించారన్నారు. దీనిలో భాగంగా గ్రామాన్ని, మండలాన్ని, నియోజకవర్గాన్ని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు. పేదలను అన్ని విధాలా ఉన్నత స్థాయికి తీసుకచ్చేలా ధనికుల సాయం తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు‌. పేదలను బంగారు కుటుంబాలుగా, ధనికులను మార్గదర్శకాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కడపలో 70 వేల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామన్నారు. వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత ఉద్యోగులు, ప్రజాప్రతినిధులదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు ఐక్యంగా, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బంగారు కుటుంబాలకు అండగా నిలిచే మార్గదర్శులను గుర్తించాలన్నారు.

రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా స్థాయిలో సక్రమంగా, విజయవంతంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అన్నారు. ప్రభుత్వంలో భాగస్వాములైన జిల్లా కలెక్టర్ నుంచి అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములై… అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా పి4 ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “బెనగరు కుటుంబం- మార్గదర్శి” కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా మాలు చేయాలన్నారు. సమాజంలో పేదరికాన్ని సమూలంగా తుడిచిపెట్టేందుకు సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, ఉద్యోగులు, ఎన్ఆర్ఐ లు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు. పథకాల అమలు విషయంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… వైఎస్ఆర్ కడప జిల్లా స్వర్ణాంధ్ర- 2047 కు జిల్లా లక్ష్యాన్ని చేరుకోవడానికి రానున్న ఐదేళ్లలో జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి సంవత్సరం 15% అభివృద్ధి రేటును పెంచుకుంటూ పోతే.. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని 100% సునాయాసంగా చేరుకోవచ్చని తెలియజేశారు. సమాజంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం పి4 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పి4 ఫౌండేషన్ ను ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని.. జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి, సామాజిక వేత్త, విద్యార్థులు, వ్యాపార వేత్త ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్వర్ణ ఆంధ్ర @2047 ఓ భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా 5 ఏళ్ళ (2024-29) విజన్ ప్రణాలికకు సంబంధించి వివరాలను జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లా ఆర్థిక ఆశయం ఆంధ్రప్రదేశ్ లక్ష్యం 2047 నాటికి తలసరి ఆదాయం రూ. 43,000 కోట్లతో 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఇది 15% వార్షిక వృద్ధిని లక్ష్యంగా చేసుకుందన్నారు. మొత్తం రాష్ట్ర పరిపాలనా యంత్రాల యొక్క చురుకైన ప్రమేయంతో డిసెంబర్ 13, 2024 న విజన్ పత్రం ఖరారు చేసి లాంచ్ చేయడం జరిగిందన్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా ఆర్థిక వ్యవస్థ.. వ్యవసాయం, పరిశ్రమ మరియు సేవలు మొదలైన మూడు కీలక రంగాలచే నడపబడుతుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశంతో.. జిల్లాలోని స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. సంపదను సృష్టించడం తోపాటు ఉద్యోగాలు సృష్టిస్తున్నామన్నారు. పి 4 అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆరు నెలలుగా క్షేత్ర స్థాయిలో విస్త్రత సర్వే, సమాచారం సేకరించి, పి 4ను తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నత ఆశయాలు, ఆలోచనలను సాకారం చేసే దిశగా అందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బంగారు కుటుంబాలకు అవసరమైన అవసరాలను క్షుణ్ణంగా గుర్తించి, వారికి సహాయ సహకారాలు అందించే మార్గదర్శులను ఎంపిక చేయాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు.. వారి గ్రామాల్లోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆపన్నహస్తం అందించాలనే సదుద్దేశ్యంతో మార్గదర్శులు కూడా ముందుకొస్తే.. పి4 కార్యక్రమం 100 శాతం విజయవంతం చేయవచ్చని, స్వర్ణాంధ్రప్రదేశ్ ఆశయ సాధన సంపూర్ణం అవుతుందన్నారు.

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడుతూ.. విజన్ 2020 సృష్టికర్త చంద్రబాబునాయుడు అని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలని కోరుకున్న విజనరీ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుని.. ఒక ప్రక్క అభివృద్ధి, మరో ప్రక్క సంక్షేమ పథకాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందజేస్తూ.. భవిష్య తరాల గురించి ఆలోచించే గొప్ప నాయకులన్నారు. పీ4 విధానాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఒక గ్రామంలో పుట్టి అక్కడే చదివి తిరిగి విదేశాల్లో స్థిర పడినవారు ఉండవచ్చు.. ఉన్నత స్థానంలో ఉన్నవారు కావచ్చు.. వ్యాపార రంగంలోఉన్నవారు కావచ్చు. మనం బంగారు కుటుంబాల కోసం ఏదైతే సర్వే చేశామో అది గ్రామీణ స్థాయి నుంచి వారి అవసరాలు ఏంటి ? వాళ్ళని ఈ రంగాల్లోనూ ముందుకు తీసుకురావాలి ? అన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పి 4 విధానం పెట్టారన్న విషయం అందరం గుర్తించుకోవాలన్నారు.

* *ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను తీర్చి దిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. అందులో నాధర్మ భాగస్వామ్యం కావాలన్నారు. బంగారు కుటుంబాలను ఎంపిక చేయడంతో పాటు ఈ బంగారు కుటుంబాలకు అవసరమైన సాయం అందించడానికి ముందుకు వచ్చే మార్గదర్శులను గుర్తించాలన్నారు. ఎంతో మంది స్థానికంగా ఉన్న వారితో పాటు ఎన్ఆర్ఐ లు వారి ఊర్లను అభివృద్ధి చేయడం కోసం ముందుకు రావడం శుభ పరిణామం అని, వీరి అందరి సహకారంతో పి4 సాధనకు చిత్తశుద్ధితో పని చేద్దామన్నారు.

కార్యక్రమంలో ముందుగా.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. జిల్లాలో పి4 అమలుకు రూపొందించిన ప్రణాళిక అంశాలను పవర్ పాయింట్ ద్వారా ఇంఛార్జి మంత్రికి వివరించారు.

ఈ సమావేశంలో జేసీ అదితిసింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, అన్ని రెవెన్యూ డివిజన్ల ఆర్డీవోలు, సీపీవో హజరతయ్య అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, నియోజకవర్గ ప్రత్యేకధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *