విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమలలోని వేంకటేశ్వరుని కళ్యాణం నుంచి మండపాల్లో జరిగే సామాన్యుల పెళ్లిళ్ల వరకు ఎక్కడైనా మంగళవాయిద్యాలు అంటే నాయీబ్రాహ్మణులే వాయిస్తారని.అలాంటి నాయీబ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఇప్పుడు ఆసన్నమైందని ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు.విజయవాడ రాఘవేంద్ర థియేటర్ సమీపంలోని పండూరి సంగయ్య నాయీబ్రాహ్మణ కళ్యాణమండపంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ వృత్తిదారుల గౌరవ రక్షణ చట్టం కోసం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మిగిలిన బీసీలందరూ కూడా మీవెంటే వస్తారు. తమిళనాడులో ఇలాంటి ఉద్యమంతోనే డీఎంకే ఉద్భవించింది. అక్కడ స్టాలిన్ ముఖ్యమంత్రి అయినట్లే ఇక్కడ మీ నుంచి ముఖ్యమంత్రి వస్తారు. కులం అనేది అస్తిత్వం.. దీన్నే ఆస్తిగా మార్చుకోండి. ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా మీ కులం కోసం పనిచేయండి. మనం ఎంతమంది ఉన్నామో ఈ దేశ సంపదలో, ఈ రాష్ట్ర సంపదలో అంత మన వాటా ఉంటుంది. దాన్ని సాధించుకోవడానికి ఉద్యమించండి’’ అని పిలుపునిచ్చారు. కేవలం జుట్టు కత్తిరించడం,గడ్డం చేయడమే కాక మసాజ్,ఫేషియల్ చేస్తున్నారు.కొన్నిచోట్ల ఇవి వ్యభిచార కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి.నాయీబ్రాహ్మణ కులవృత్తి ఎంతో గౌరవప్రదమైనది.ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో అత్యవసరమైనది. తాతముత్తాతల కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ వృత్తిలో ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా వస్తున్న ఈ కార్పొరేట్ తరహా సెలూన్లనుఅడ్డుకోవాలి.నాయీబ్రాహ్మణులందరూ ఏకతాటి మీద నిలబడాలి.ఎదురవుతున్న సమస్యలపై పోరాడాలి.మెడికల్ షాపు పెట్టుకోవాలంటే బీ-ఫార్మసీ లాంటి డిగ్రీలు ఉంటేనే లైసెన్సు ఇస్తారు.అలాగే ఇప్పుడు సెలూన్లు పెట్టుకోవాలన్నా కూడా తప్పనిసరిగా నాయీబ్రాహ్మణ కుల ధ్రువీకరణ పత్రం ఉండేలా ప్రభుత్వం చట్టం చేయాలి. అంతే కాదు.. మనకు చట్టబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లలో వాటానను కూడా ఈడబ్ల్యుఎస్ పేరుతో కమ్మ, రెడ్డి లాంటి అగ్రకులాల వాళ్లు తీసేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఒక్క బీసీ అయినా ముఖ్యమంత్రి అయ్యారా? ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవుల్లే వారే ఉంటున్నారు. అయినా కూడా ఆ కులాలకు ఈడబ్ల్యుఎస్ పేరుతో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి అంశాలన్నింటిపైనా సమైక్య పోరాటం చేయాల్సిన తరుణం అసన్నమైంది. మీరంతా నల్లచొక్కాలు, నల్ల టీషర్టులు వేసుకుని 40 రోజుల మండల దీక్ష చేయండి.
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఏఐబీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త పరంజ్యోతి మాట్లాడుతూ, ‘‘గతంలో ఒకసారి ఈ వృత్తిదారుల మీద దాడులు జరిగితే అందరూ సమైక్యంగా చేసిన ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వంలో ఈ కులం అంటే ఒక గౌరవం ఏర్పడింది. వీరంతా తెగువ చూపడం వల్లే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పడింది.పంచాయతీలు,మునిసిపాలిటీల్లో నాయీబ్రాహ్మణులకు దుకాణాలు కేటాయించాలని జీవో-14 జారీచేశారు. మునిసిపాలిటీలు, పంచాయతీల్లో ఖాళీ స్థలాలు ఉంటే,బంకు పెట్టుకోవడానికి నాయీ బ్రాహ్మణులకు స్థలం కేటాయించాలని జీవో-13 ఇచ్చారు.ఇవన్నీ ఉద్యమిస్తేనే వచ్చాయి. అందువల్ల ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఉద్యమించాలి’’ అని సూచించారు.
ఇతర కులాలు, మతాలు, రాష్ట్రాలకు చెందినవాళ్లంతా ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చి, ఇక్కడ కార్పొరేట్ సెలూన్లు పెడుతూ అనైతిక, అక్రమ కార్యకలాపాలు చేస్తుంటే నాయీ బ్రాహ్మణ కులస్థులంతా ఏం చేస్తున్నారని సీనియర్ పాత్రికేయుడు అన్నవరం బ్రహ్మయ్య ప్రశ్నించారు. గతంలో ఈ కుల నాయకులు ఉమ్మడిగా ఉద్యమించడం ద్వారానే అనేక హక్కులు సాధించుకున్నారని, ఇప్పుడు కూడా మరోసారి ఆత్మగౌరవ నినాదంతో ముందుకొచ్చి, ఉద్యమించుకునేందుకు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. నాయీబ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాక్షారపు సూరిబాబు,ఏఐబీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News