మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గ్రామ పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు పంచాయతీ అభివృద్ధి సూచికలు పరివర్తనపై నిర్వహించిన జిల్లా స్థాయి ప్రచార కార్యశాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కింది స్థాయి వరకు అభివృద్ధి జరిగితేనే అది నిజమైన అభివృద్ధి అని, ఆ అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందితేనే అది పరిపూర్ణం అవుతుందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి 2030 అజెండాలో భాగంగా ప్రపంచ దేశాలకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనగా నిర్ణయించి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావడానికి ఆమోదించిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి కొన్ని అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించి ఉత్తమ మార్కులు సాధించిన పంచాయితీలకు రూ. కోటికి పైగా ప్రోత్సాహక నిధులను మంజూరు చేస్తుందన్నారు. నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని, 90 నుంచి 100 మధ్య స్కోరు సాధించాలని కోరుతూ ఏ రంగంలో పంచాయతీలు వెనుకబడి ఉన్నాయో గుర్తించి లోపాలను సరిచేసి, జిల్లాను ఉత్తమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం గ్రామాలలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన థీమ్ లను మొవ్వ మండల డిప్యూటీ ఎంపీడీవో పరమాత్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పేదరికం లేని మెరుగైన జీవనోపాదులు కలిగిన పంచాయితీ, ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీ, బాలిక స్నేహపూర్వక, నీరు సమృద్ధి గల, పచ్చదనం పరిశుభ్రత కలిగిన, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు కలిగిన, సామాజిక న్యాయం సామాజిక భద్రత కలిగిన, సుపరిపాలన కలిగిన, మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీ వంటి 9 థీమ్ లను ఆయన వివరించారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడు, పలువురు జడ్పిటిసిలు, జిల్లా అధికారులు, డి ఎల్ డి ఓ లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News