-విజయవాడ ఉత్సవ్ తో మరింత పెరగనున్న నగర ప్రతిష్ట..
-ప్రముఖుల రాకతో విజయవాడ వైపు ఆసక్తిగా చూస్తున్న జాతీయ మీడియా..
-విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్తులో విజయవాడ నగరాన్ని గ్లోబల్ కల్చరల్ హబ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. పున్నమి ఘాట్ లో విజయవాడ ఉత్సవ్ ఏర్పాట్లను గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముతో కలిసి ఎంపీ శివనాథ్ పరిశీలించారు. పశ్చిమ నియోజకవర్గ టిడిపి నేతలు ఎంపీ కేశినేని శివనాథ్ కు విజయవాడ ఉత్సవ్ జెండాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ నగరం మరింత శోభాయమానంగా దర్శనమిస్తుందని, ఈ ఉత్సవం ప్రతి ఒక్కరికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద పరమైన అనుభూతిని కలిగించేలా సిద్ధమైందని తెలిపారు.
విజయవాడ ఎప్పుడూ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగానే నిలుస్తోంది. కానీ ఈసారి ‘విజయవాడ ఉత్సవ్’తో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఉత్సవం నగర గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరింత పెంచుతుందని ఎంపీ అన్నారు. ప్రజలు ఒకే వేదికపై కలుసుకోవాలి. ఆనందం పంచుకోవాలి. చిన్నా పెద్దా అందరూ కలిసి సంస్కృతి, సంప్రదాయం, వినోదం, సాంకేతికత అనుభూతిని పొందాలి. అదే ఉత్సవం వెనుక అసలు ఉద్దేశ్యం” అని ఎంపీ వివరించారు.
ఈ ఉత్సవానికి నిర్వాహకులు తాము కాదు, అసలు నిర్వాహకులు విజయవాడ ప్రజలే. ఎవరి సహకారం లేకుండా ఈ ఉత్సవం విజయవంతం కావడం అసాధ్యం. అందుకే ప్రతి పౌరుడూ తమదైన వేదికగా భావించి ముందుకు రావాలి” అని శివనాథ్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలపై ఎంపీ స్పందిస్తూ “విమర్శలు చేయడం సులభం. కానీ ప్రజా ఉత్సవం ముందు వాటికి విలువ ఉండదు. ఈ నగరం అభివృద్ధి, గౌరవం కోసం జరుగుతున్న పండుగను అడ్డుకోవాలనుకునే వారి ప్రయత్నాలు ప్రజలే తిరస్కరిస్తారు” అన్నారు.
ఈసారి జరిగే ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు వంటి ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో జాతీయ మీడియా ఆసక్తిగా చూస్తుందని ఎంపీ తెలిపారు. విజయవాడ ఉత్సవ్ మన గర్వకారణం. ఇది కేవలం ఉత్సవం కాదు, మన భవిష్యత్తు, మన సంస్కృతి, మన గౌరవానికి ప్రతీక. అందరూ తరలివచ్చి ఈ వేడుకలో భాగమవ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యకురాలు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు, క్లస్టర్ ఇన్చార్జ్ యేదుపాటి రామయ్య, క్లస్టర్ ఇన్చార్జ్ సుబ్బారెడ్డి , డివిజన్ అధ్యక్షులు సుబ్బయ్య, శివశర్మ, సంతోష్, పత్తినాగేశ్వరరావు, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు సుఖాసి సరిత, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలా మాధవ,డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చా మల్లిఖార్జున్, టిడిపి నాయకులు యువి శివాజీ,నారాయణ స్వామి, ఎమ్.డి అన్సార్, కుప్పిలి నాగబాబు, పీతాబుజ్జి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News