గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ ల వారీగా త్రాగునీటి సరఫరాపై ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడైనా పూర్తి స్థాయిలో సరఫరా కాకుంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణబాబు కాలనీ, కెవిపి కాలనీ, కోదండరామయ్య నగర్, పట్టాభిపురం ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణబాబు కాలనీ నుండి త్రాగునీటి సరఫరాపై పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదు మేరకు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పర్యటించి, ఫిర్యాదుదారులతో వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ రిజర్వాయర్ నుండి టైలేండ్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏమైనా పైప్ లైన్ మరమత్తుల కారణంగా సరఫరా నిలిపిన అనంతరం పునరుద్ధరణకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు తెలుపుతున్నారని, కాని సరఫరాలో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎమినిటి కార్యదర్శులు నీటి సరఫరా సమయంలో క్షేత్ర స్థాయిలో సరఫరా తనిఖీ, క్లోరిన్ శ్యాంపిల్స్ సేకరణ చేయాలన్నారు. అలాగే కృష్ణబాబు కాలనీలోని అన్ని డ్రైన్లలో మంగళవారం మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా శుభ్రం చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ దరఖాస్తులు, అభివృద్ధి పనులను పరిశీలించి తదుపరి చర్యలపై ఆయా విభాగాల అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
పర్యటనలో డిసిపీ సూరజ్ కుమార్, బయాలజిస్ట్ రాజు నాయక్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News