– కేసులతో నా గొంతు నొక్కలేరు
– బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం
పుంగనూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, చిన్నపిల్లలపై దాడులు, అరాచకాలు నిత్యకృత్యమయ్యాయని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే ప్రజలు మార్పు కోరుకున్నారని, అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలు, చిన్నారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, తీసుకున్న చర్యలు శూన్యమని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పుంగనూరులో మీడియాతో మాట్లాడారు.
ఆడపిల్లలను వేధించిన వాళ్లని వదిలేసి, బాధితులపైనే కేసులా? మీ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే?
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో చెప్పడానికి తన కుటుంబానికి ఎదురైన ఘటనే ప్రత్యక్ష సాక్ష్యమని బోడె రామచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న తన కుమార్తె, ఆమె స్నేహితురాళ్లు ప్రయాణిస్తున్న కారును ఒక ఆకతాయి సుమారు పది కిలోమీటర్లు వెంబడించి, పుంగనూరు సమీపంలో అడ్డగించి, అయ్యప్ప మాలలో ఉన్న డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ ఆడపిల్లలను భయభ్రాంతులకు గురిచేశాడని తెలిపారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, అలా చేయకపోగా బాధితులైన తన సిబ్బందిని, డ్రైవర్‌ను రాత్రంతా పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి, మరుసటి రోజు కూడా డీఎస్పీ ఆఫీసులో గంటల తరబడి వేధించారని మండిపడ్డారు. ఒక చిన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పరిష్కరించగల సమస్యను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించడం వెనుక ఉన్న రాజకీయ కుట్ర ఏమిటని ప్రశ్నించారు. ఆడపిల్లల జోలికి వస్తే, కుటుంబ సభ్యులను వేధిస్తే చూస్తూ ఊరుకోనని, తాను ప్రభుత్వ అవినీతి ఫైల్స్ తెరిస్తే పాలకుల బండారమంతా బయటపడుతుందని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు.
రాజ్యాంగేతర శక్తిగా నారా లోకేష్… హోం శాఖపై పెత్తనం ఎవరిచ్చారు?
రాష్ట్రంలో హోం శాఖను ముఖ్యమంత్రి పుత్రరత్నం నారా లోకేష్ ఒక రాజ్యాంగేతర శక్తిగా నడిపిస్తున్నారని రామచంద్ర యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. పేరుకు ఒక దళిత మహిళను హోంమంత్రిని చేసినా, అధికారం మొత్తం లోకేష్ చేతిలోనే ఉందని, జిల్లా ఎస్పీలకు, ఉన్నతాధికారులకు నేరుగా ఆయన కార్యాలయం నుండే ఆదేశాలు వెళ్తున్నాయని, పోలీస్ వ్యవస్థను తన రాజకీయ కక్ష సాధింపులకు, సొంత ప్రయోజనాలకు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా అని నిలదీశారు. ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన అన్ని శాఖల్లో వేలు పెట్టే అధికారం ఎవరిచ్చారని, ఈ అప్రకటిత “సూపర్ హోం మినిస్టర్” పెత్తనాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు
రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని, గల్లీగల్లీలో చాక్లెట్లు అమ్మినంత సులభంగా డ్రగ్స్ అమ్ముతూ యువత భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల అండదండలు, పోలీసుల ఉదాసీనత లేకుండా ఇంత పెద్దఎత్తున డ్రగ్స్ మాఫియా పెట్రేగిపోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ వినియోగం, రవాణా అనేక రెట్లు పెరిగిందని, దీనికి ప్రభుత్వ అసమర్థతే కారణమని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న రాజకీయ శక్తులను, ప్రభుత్వ పెద్దలను బయటపెట్టేందుకు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలని, లేదంటే ఈ పాపంలో ప్రభుత్వ పెద్దలకూ వాటా ఉందని ప్రజలు భావించాల్సి వస్తుందని డిమాండ్ చేశారు.
కేసులతో నా గొంతు నొక్కలేరు
గత ప్రభుత్వం తనపై 30కి పైగా తప్పుడు కేసులు పెట్టిందని, ఈ ప్రభుత్వం కూడా తన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే 20 నెలల్లో 17 అక్రమ కేసులు బనాయించిందని రామచంద్ర యాదవ్ తెలిపారు. కేసులతో తన పోరాటాన్ని ఆపలేరని, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఒక ప్రత్యామ్నాయం కోసం పోరాడుతున్న తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తనపై నిఘా పెట్టుకుంటే భయపడేది లేదని, తాను ఎర్రచందనం దొంగనో, ఇసుక మాఫియా డాన్నో, ప్రభుత్వ రహస్య మిత్రుడినో కాదని, ఒక సామాన్య పౌరుడిగా ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు.
విద్యాశాఖను చక్కదిద్దలేని లోకేష్.. ఇతర శాఖల్లో వేలు పెడుతున్నాడు
ఇతర శాఖల్లో జోక్యం చేసుకునే నారా లోకేష్, ముందు తన చేతిలో ఉన్న విద్యాశాఖను చక్కదిద్దాలని, దానిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. టెట్ సమస్యతో వేలాది మంది ఉపాధ్యాయులు బీపీ, షుగర్లతో రోడ్డున పడితే పట్టించుకోని ఆయన, హోం శాఖపై పెత్తనం చెలాయించడం సిగ్గుచేటన్నారు. చేతనైతే సుప్రీంకోర్టులో పోరాడి, కేంద్రంతో మాట్లాడి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించారు. అన్ని శాఖలకూ తానే మంత్రి అనుకుంటే, గవర్నర్ వద్దకు వెళ్లి ఆ ప్రకారమే ప్రమాణ స్వీకారం చేయించుకోవాలని, అంతేకానీ దొడ్డిదారిన పెత్తనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బోడె రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.
Prajavartha Online Telugu News