విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద ఆదివారం “మా ఆర్ట్స్ చంటి, బాబీ” ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి శివ కళ్యాణోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు..
ఈ మహోత్సవంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు, సాంస్కృతిక కార్యక్రమాలలో శివతత్త్వాన్ని ప్రతిబింబించిన విద్యార్థులను అభినందించి, వారి ప్రతిభను ప్రశంసించారు, వేదమంత్రాల నాదంలో జరిగిన కళ్యాణోత్సవం కార్యక్రమం భక్తుల హృదయాలను ఆవహించింది..
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినం దేశవ్యాప్తంగా భక్తి వాతావరణాన్ని సృష్టించిందని తెలిపారు. సృష్టికి ఆదిగురువైన పరమశివుని ఆశీస్సుల కోసం భక్తులు జాగరణలు చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ, “ఓం నమఃశివాయ” నామస్మరణతో ఆలయాలను మార్మోగిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల నుండి విజయవాడ వరకు శివాలయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం ఆనందకరమని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు..
సెంట్రల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ప్రాంతంలో నిర్వహించిన జాగరణ మహోత్సవాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా బాబీ చంటి ఆధ్వర్యంలో మొత్తం బృందం అహర్నిశలు శ్రమించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించిందని కొనియాడారు..
అదేవిధంగా బొండా రవితేజ మాట్లాడుతూ, నగరంలోనే అతిపెద్ద శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించి మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. సృష్టికి ఆదిగురువైన పరమేశ్వరుడి ఆశీస్సులు యావత్ ప్రపంచానికి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు..
భక్తి, శ్రద్ధ, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ మహాశివరాత్రి శివ కళ్యాణోత్సవం సెంట్రల్ నియోజకవర్గంలో విశేష స్పందన పొందింది. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ప్రజలందరికీ పరమశివుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News