– సిపిఐ పిలుపు ఇరాన్‌పై అమెరికా
–ఇజ్రాయిల్ దాడులను ఖండించాలి
– ప్రపంచ శాంతి కోసం ఐక్య పోరాటం అవసరం
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సామ్రాజ్యవాద యుద్ధన్మాదాన్ని ఖండిస్తూ, ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పిలుపునిచ్చింది. అనంతపురం నగరంలోని ఎన్జీవో హోంలో సిపిఐ ఆధ్వర్యంలో “ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ దాడులను ఖండించాలి – యుద్ధన్మాదం, సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ నాయకుడు కె. రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ ఇన్స్సఫ్ రాష్ట్ర కార్యదర్శి సి. జాఫర్ AISF రాష్ట్ర కార్యదర్శి నాసర్ జీ, AIYF రాష్ట్ర అధ్యక్షుడు జి. సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె. రామకృష్ణ మాట్లాడుతూ, మార్చి 23న స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతిని దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించాలని సిపిఐ పిలుపునిచ్చిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తితో, నేటి తరానికి కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం అత్యవసరమని పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదం ప్రమాదకర ధోరణులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనలో ఇతర దేశాలపై ఒత్తిడి, జోక్యాలు పెరిగాయని విమర్శించారు. వెనిజులా, క్యూబా వంటి దేశాలపై ఆర్థిక, రాజకీయ ఒత్తిడి, అలాగే ఇరాన్‌పై ఇజ్రాయిల్‌తో కలిసి జరుగుతున్న దాడులు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవలి కాలంలో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ దాడులు తీవ్రరూపం దాల్చడం వల్ల ప్రపంచాన్ని యుద్ధ ముప్పులోకి నెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. అమెరికా ప్రజల్లోనే యుద్ధ వ్యతిరేక స్వరం పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.క్యూబాపై అమలు చేస్తున్న ఆర్థిక దిగ్బంధనం వల్ల అక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఔషధాలు, ఆహారం, ఇంధనం కొరత ఏర్పడిందని తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచానికి వైద్య సహాయం అందించిన క్యూబాను ఇబ్బందులకు గురిచేయడం మానవత్వానికి విరుద్ధమని అన్నారు.ఇలాంటి సందర్భంలో భారత ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి, ఈ దాడులను ఖండించడంలో విఫలమవడం దురదృష్టకరమని సిపిఐ నాయకులు విమర్శించారు.ఈ నేపథ్యంలో మార్చి 23న దేశవ్యాప్తంగా భగత్ సింగ్, రాజగురు వర్ధంతిని సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తూ, సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి తీర్మానాలు ఆమోదించాలని సిపిఐ పిలుపునిచ్చింది.ప్రపంచ శాంతి కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున రాజారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు కేశవరెడ్డి రామకృష్ణ పద్మావతి టి.నారాయణస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య రాజేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హనుమంతు రాయుడు కుళ్లాయిస్వామి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కోట్రేస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News