Breaking News

గుంటూరు రూపురేఖలు మారాలి

-సుందరమైన, ఆకర్షణీయమైన పట్టణంగా మారాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు పట్టణ రూపురేఖలు మారాలని, సుందరమైన, ఆకర్షణీయమైన పట్టణంగా మారాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పెమ్మసాని చంద్ర శేఖర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడాలని అన్నారు. సురక్షిత తాగునీరు, చక్కని పారిశుధ్యం, ఆహ్లాదాన్ని ఇచ్చే పార్కులు, మంచి రహదారులు, కాలువలు వంటి సౌకర్యాలు సమకూర్చి సుందరమైన పట్టణంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఆసక్తిగల పౌరులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా వాణిజ్య సంస్థల నుండి వచ్చే చెత్త నిర్మాణ పట్ల దృష్టి సారించాలని ఆదేశించారు. పారిశుధ్యం నిర్వహణను ప్రాధాన్యతగా చేపట్టాలని అన్నారు. ప్రజా వినియోగం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని అన్నారు. బొంగరాలబీడు వద్ద మంచి పార్కు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పనులు త్వరగా పూర్తి చేయుటకు అవసరం మేరకు కార్మికులను పెంచాలని, 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వేగవంతంగా పూర్తి చేయుటకు ఉన్న ఆటంకాలను పరిష్కరించాలని ఆదేశించారు. గోరంట్ల నీటి పథకం జూన్ మొదటి వారం నాటికి ప్రారంభం కావాలని ఆదేశించారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు.

శాసన సభ్యులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ పనులు చేపట్టి కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ లను కొనసాగించడం వలన పనులు త్వరగా పూర్తి కాగలవని చెప్పారు.

శాసన సభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ కుక్కల బెడద నియంత్రించాల్సిన అవసరం ఉందని, ప్రత్యేక స్థలాలు కేటాయించాలని సూచించారు. పట్టణంలో పారిశుధ్యం మెరుగు పడాలని అన్నారు. కాలువల్లో పూడికలు తీయడం పక్కాగా చేపట్టాలని అన్నారు. ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్ (ఇ.ఎస్.ఎల్.ఆర్), జీ.ఎస్.ఎల్.ఆర్ పనులు చేయడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు.

శాసన సభ్యులు డా.బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు వేగవంతంగా పూర్తి చేయుటకు ఉన్న ఆటంకాలను పరిష్కరించాలన్నారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యం బాగా వినియోగిస్తున్నారని, ప్రజా మరుగుదొడ్లు ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ మానస సరోవరం అభివృద్ధి పనులను పి.పి.పి మోడ్ లో చేపట్టుటకు ఆలోచన ఉందన్నారు. అమృత్ 2.0 క్రింద చెరువు పునరుద్ధరణకు అవకాశం ఉందని చెప్పారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు శాస్త్రీయ విశ్లేషణ చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. పట్టణంలో జంక్షన్ ల వద్ద సుందరీకరణ చర్యలు చేపడుతున్నామని, పోస్టర్లు గోడలు మీద అతికించి పట్టణాన్ని అందవిహీనంగా చేయకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. జంక్షన్ ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, తద్వారా ప్రమాదాలు జరుగుతున్నట్లు గమనించడం జరిగిందన్నారు.

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్  కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ పి.వి.కె నాయుడు వెజిటబుల్ మార్కెట్ నిర్మాణానికి ఆసక్తి ఉన్న వారి (Expression of Interest)
నుండి దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ నాటికి ఆహ్వానించామన్నారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్వహణ అప్పగించుటకు ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. ఎన్.టి.ఆర్ మానస సరోవరం అభివృద్ధి పనులకు డి.పి.ఆర్ ల తయారీ బాధ్యత ఎపిట్ కో కు అప్పగించమని అన్నారు. దీనిని పి.పి.పి మోడ్ లో చేపట్టుటకు ఆలోచన ఉందన్నారు. బి.ఆర్ స్టేడియం తొలగింపు, పునరుద్ధరణ., ఉద్యోగ నగర్ లో 1590 కిలో లీటర్ల నీటి పథకం, ఏ.టి.అగ్రహారంలో 16 వందల కిలో లీటర్ల నీటి పథకం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నామని వివరించారు. తాగు నీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పారిశుధ్య నిర్వహణకు రెండు వందల ఇ – ఆటోలను ప్రభుత్వం పంపిణీ చేయనుందని తద్వారా పారిశుధ్యం మెరుగుదలకు మరింత అవకాశం కలుగుతుందని అన్నారు. కాలువల నిర్వహణ రూ.3.67 కోట్లుతో చేపడుతున్నామని తెలిపారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాత్రి పారిశుధ్య నిర్వహణ ప్రయోగాత్మకంగా చేపట్టామని తెలిపారు. జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను ఆడిట్ తేదీలను అనుసరించి అప్ లోడ్ చేస్తున్నామని తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, నగరపాలక సంస్థ కమిషనర్ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర రావు, చీఫ్ మెడికల్ అధికారి డా. శాంతి లత, చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి రాంబాబు, ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస్, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ లు సి.హెచ్.రమేష్, ఎం.శ్రీనివాస రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *