Breaking News

దోచుకోవడమే మీ నాలెడ్జ్…ప్రజా సేవే నా నాలెడ్జ్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత
-టీటీడీ లెటర్లు అమ్ముకోవడం…
-గన్ చూపి దోచుకోవడం… అప్పులు ఎగ్గొట్టడం… ఇదీ మీ నాలెడ్జ్
-సంస్కారంతో రాజకీయాలు చేస్తున్నాం
-సంయమనంతో ఉన్నామని నోరు జారితే ఖబడ్దార్ : మంత్ర సవిత హెచ్చరిక
-రొద్దంలో రూ.4 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లు ప్రారంభం

రొద్దం/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
నాకు టీటీడీ లెటర్లు అమ్ముకునే నాలెడ్జ్ లేదు… సొంత కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాళ్లిళ్లలో జింక మాంసం పెట్టి వేధించిన నాలెడ్జ్ నాకు లేదు… కల్యాణదుర్గం నుంచి బెంగుళూరుకు లారీల్లో ఇసుక తీసుకెళ్లి అమ్ముకునే నాకు నాలెడ్జ్ లేదు… వర్కులు అమ్ముకునే నాలెడ్జ్ లేదు… గన్ చూపించి దోచుకోవడమనే నాలెడ్జ్ అస్సలా లేదు… చెరువులు కబ్జా చేయడం, అక్రమ లే అవుట్లు వేసి అమ్ముకోవడం నాకు తెలీదు… పెనుకొండ ప్రజలకు సేవ చేయడం నాకు తెలిసిన నాలెడ్జ్… పేదలకు విద్య, వైద్యమందించడం మాత్రమే నాకు తెలిసిన నాలెడ్జ్ … మా దగ్గర చెప్పులు ఉన్నాయి… కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారు… బెంగుళూరు నుంచి కళ్యాణదుర్గం.. అక్కడి నుంచి పెనుకొండ…ఇక్కడి నుంచి మళ్లీ బెంగుళూరుకు షటిల్ సర్వీసులు చేసే వలస పక్షులను నమ్ముకోవొద్దని వైసీపీ కార్యకర్తలకు నా సూచన… నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే ఖబడ్దార్ అని వైసీపీ నాయకురాలు ఉషశ్రీ చరణ్ నుద్దేశించి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రొద్దం మండలంలో రూ.4 కోట్లకుపైగా వెచ్చించి నిర్మించిన బీటీ రోడ్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తనకు రాజకీయాలకంటే ముందే ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ పేరుతో పేదలకు విద్య, వైద్యమందించానన్నారు. తాగునీటి పంపిణీ చేశానన్నారు. కరోనా సమయంలో నియోజక వర్గంలో విస్తృతంగా తనకు తోచిన మేర సహాయమందించానని మంత్రి సవిత తెలిపారు.

ప్రజా సేవే నాకు తెలిసిన నాలెడ్జ్

ఎస్ఆర్ఆర్ ట్రస్టీగా, మంత్రిగా ప్రజలకు సేవ చేయడమే తనకు తెలిసిన ఏకైక నాలెడ్జ్ అని మంత్రి సవిత స్పష్టం చేశారు. టీటీడీ లెటర్లు అమ్ముకునే నాలెడ్జ్ తనకు అవసరంలేదన్నారు. మంత్రిగా తానిచ్చే టీటీడీ లెటర్లను కేవలం పెనుకొండ ప్రజలకు మాత్రమే ఇస్తున్నానని తెలిపారు. సొంత కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం తనకు తెలియని నాలెడ్జ్ అని అన్నారు. వాళ్లిళ్లలో జింక మాంసం పెట్టి వేధించిన నాలెడ్జ్ కూడా తనకు అవసరం లేదన్నారు. కల్యాణదుర్గం నుంచి బెంగుళూరుకు లారీల్లో ఇసుక తీసుకెళ్లి అమ్ముకునే నాలెడ్జ్ కూడా లేదన్నారు. వర్కులు అమ్ముకోవడంతో పాటు గన్ చూపించి దోచుకోవడమనే నాలెడ్జ్ తనకు అస్సలా లేదన్నారు. చెరువులు కబ్జా చేయడం, అక్రమ లే అవుట్లు వేసి అమ్ముకోవడం తనకు తెలీదన్నారు. పెనుకొండ ప్రజలకు సేవ చేయడమే తనకు తెలిసిన నాలెడ్జ్ అని మంత్రి సవిత స్పష్టంచేశారు.

వలస పక్షులను నమ్మొద్దు

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. వాళ్లకున్న నాలెడ్జ్ తో రాష్ట్రాన్ని దిగజార్చారని జగన్ పైనా, వైసీపీ నాయకులపైనా మంత్రి సవిత మండిపడ్డారు. నిజంగా వాళ్లకు నాలెడ్జే ఉంటే కళ్యాణదుర్గం తంతే పెనుకొండలో ఎందుకు పడ్డారని ఉషశ్రీ చరణ్ నుద్దేశించి ఎద్దేశా చేశారు. బెంగుళూరు వయా కళ్యాణదుర్గం వయా పెనుకొండ వయా బెంగుళూరుకు షటిల్ సర్వీసులు చేసే వలస పక్షులను నమ్ముకోవొద్దని వైసీపీ నాయకులను మంత్రి సవిత సూచించారు. నియోజక వర్గ అభివృద్ధికి రేయింబవళ్లు కృషి చేస్తున్నానని, తనకు సహకరించాలని వైసీపీ నాయకులకు పిలుపునిచ్చారు.

నోరు జారితే ఖబడ్దార్

చెప్పులు అందరికీ ఉంటాయని, తాము వేయించగలమని, కాని, తమ నాయకుడు క్రమశిక్షణతో మెలగాలని దిశా నిర్దేశం చేశారని మంత్రి సవిత తెలిపారు. అందుకే, వాళ్లెంత రెచ్చగొడుతున్నా సంయమనంతో, సంస్కారంతో వ్యవహరిస్తున్నామన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదంటూ ఖబడ్డార్ అని మంత్రి సవిత హెచ్చరించారు.

ప్రతి గ్రామానికీ రహదారి సౌకర్యం

అంతకుముందు రొద్దం మండలంలో రాచూరు నుంచి జక్కలచెరువు వరకు రూ.85 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి సవిత ప్రారంభించారు.రూ.1.35 కోట్లతో రొద్దం – బుచ్చెర్ల రోడ్ నుంచి నారా నాగేపల్లి బీటీ రోడ్డును, రూ.85 లక్షలతో నిర్మించిన బుచ్చెర్ల రోడ్ నుంచి నారా నాగేపల్లి బీసీ రోడ్డను, రూ.99 లక్షలతో నారా నాగే పల్లి నుంచి బుగుడూరు (రాష్ట్ర సరిహద్దు) వరకు నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, మాటలు చెప్పడం, విమర్శలు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయని గత నాయకులు రొద్దం మండలాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే పరిష్కరించామన్నారు. ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేసే వారికి అభివృద్ధే తమ సమాధానమన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి సవిత స్పష్టంచేశారు. బీటీ రోడ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సవితకు ఆయా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *