Breaking News

ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

-ఎన్నికల సిబ్బందికి జిల్లా స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలను పూర్తిస్థాయిలో హేతుబద్ధీకరించి, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమంలో కె భాస్కర్ రెడ్డి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల డిప్యూటీ కలెక్టర్లు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు)కు ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం అమలు విధానం, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై భాస్కర్ రెడ్డి సమగ్ర అవగాహన కల్పించారు.

ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాల ధృవీకరణ
ఓటరు జాబితాల నాణ్యతను మెరుగు పరచడంలో ఇంటింటి సర్వే కీలకమని డీఆర్వో పేర్కొన్నారు. బీఎల్‌వోలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, కొత్తగా అర్హత పొందిన ఓటర్లను గుర్తించి నమోదు చేయాలని సూచించారు. అలాగే మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు, అనర్హులుగా మారిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించి సంబంధిత నివేదికలను సమర్పించాలని తెలిపారు.
నిర్దేశిత గడువుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపట్టిక ప్రకారం ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఇంటింటి ధృవీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం ఆగస్టు 1న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటరు జాబితా ప్రచురించబడుతుందని వివరించారు.

అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు అవకాశం
డ్రాఫ్ట్ జాబితా ప్రచురణ అనంతరం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణలు, పేర్ల తొలగింపులు తదితర అంశాలపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారని తెలిపారు. అందిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పారదర్శకతకు ప్రాధాన్యం
ఓటరు జాబితాల ఖచ్చితత్వం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమని డీఆర్వో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ప్రతి అర్హ పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించేలా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు ఎమ్ ఎమ్ ఆర్ ప్రేమ్ కుమార్, కె భాగ్యలక్షి, కె ఆనంద్ రావు, ఆర్ శివ రాముడు, ఎన్నికల విభాగం అధికారులు, ఎన్నికల డిప్యూటీ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *