విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు “వ్యక్తిత్వ వికాసం” అనే అంశంపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసం యొక్క ప్రాధాన్యతను పరిచయం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కేవలం విద్యా ప్రతిభపైనే ఆధారపడదని, మంచి ఆలోచనా విధానం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, సానుకూల దృక్పథం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఇతరుల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత వంటి అంశాలు కూడా వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి, తన బలాలు–బలహీనతలను అర్థం చేసుకుని, నిరంతరం తనను తాను మెరుగుపరుచుకోవాలని డాక్టర్ సమరం సూచించారు. జీవితంలో ఎదురయ్యే అపజయాలను నిరాశకు కారణంగా కాకుండా, తనను తాను అభివృద్ధి చేసుకునే అవకాశాలుగా స్వీకరించాలి అని ఆయన అన్నారు. సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి రెడ్ క్రాస్ ఎన్నో అవగాహన కార్యక్రమాలని అందిస్తోందన్నారు. అందులో భాగంగా విద్యార్థుల సమగ్ర వికాసం కోసం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సైకాలజిస్ట్ డాక్టర్ ఆర్.ఎస్. రమాదేవి మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వివిధ అంశాలను విద్యార్థులకు సులభంగా, ఆసక్తికరంగా వివరించారు. వ్యక్తిత్వం అనేది కేవలం బాహ్య రూపానికి సంబంధించినది కాదని, మన ఆలోచనలు, ప్రవర్తన, మాట తీరు, ఇతరులతో వ్యవహరించే విధానం, భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం మరియు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే విధానం కలిపి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయని ఆమె వివరించారు. విద్యార్థులు తమలోని సానుకూల లక్షణాలను పెంపొందించుకోవడంతో పాటు, ప్రతికూల ఆలోచనలు మరియు అలవాట్లను అధిగమించేందుకు కృషి చేయాలని డాక్టర్ రమాదేవి సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని కోసం ప్రణాళికతో ముందుకు సాగడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, నిరంతరం నేర్చుకోవడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం మరియు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి అంశాలు విద్యార్థుల భవిష్యత్తు విజయానికి ఉపయోగపడతాయని ఆమె వివరించారు. అనంతరం అదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వీర్రాజు మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు జీవిత నైపుణ్యాలు, విలువలు, సామాజిక బాధ్యతలను నేర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొంటూ, కార్యక్రమంలో పాల్గొన్న వక్తలకు మరియు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని ఆయన ప్రోత్సహించారు. వ్యక్తిత్వ వికాసంపై జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అత్యంత మంచి స్పందన లభించింది. సుమారు 150 మంది విద్యార్థులు ఎంతో శ్రద్ధగా కార్యక్రమాన్ని విని, వక్తలు వివరించిన అంశాలను ఆసక్తిగా స్వీకరించారు. పలువురు విద్యార్థులు కార్యక్రమం తమ ఆలోచనా విధానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు భవిష్యత్తు లక్ష్యాలపై తమ దృక్పథాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడిందని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News