-రాజ్యాంగ పితామహుడికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుల రహిత ఆధునిక భారతావని నిర్మాణానికి డా. బి.ఆర్.అంబేద్కర్ తన జీవితకాలం అలుపెరుగని పోరాటం చేశారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని గిరిపురంలోని రెడ్ సర్కిల్ సెంటర్, అంబేద్కర్ లైబ్రరీలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. బాల్యంలో అడుగడుగునా అవమానాలకు గురైనా.. పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషి, స్వీయ ప్రతిభతో ఎదిగి స్వతంత్ర భారత తొలి కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో ఉన్న వివక్షను పారద్రోలడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. అంటరానితనంపై ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. వివక్షను సమాజం నుంచి తరిమికొట్టేందుకు, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. సామాజిక న్యాయం, స్వాతంత్య్రం, అంటరానితనం, రిజర్వేషన్లపై తనదైన శైలిలో రాజ్యాంగంలో వివరణలు ఇచ్చారని చెప్పారు. ప్రపంచంలోనే 100 శాతం ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం కలిగిన రాజ్యాంగం ఉందంటే.. అది భారత రాజ్యాంగం మాత్రమేనని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువకులు, విద్యావంతులు, ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పేదలకు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు కుక్కల రమేష్, మనోహర్, కాజా శంకర్, హైమావతి, కొమ్ము చంటి, బద్దేటి ఇస్సాక్, చిన్నబ్బాయి, గల్లపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News