-బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజం చేసి చూపారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డిలతో కలిసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని.. సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. అటువంటి మహనీయుని జయంత్యుత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీవో ఇవ్వడం హర్షణీయమన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం బాబా సాహెబ్ చేసిన అలుపెరుగని పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదని.. కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధాన ఆశయమన్నారు. అంబేద్కర్ కృషి ఫలితంగానే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నత విలువలు కలిగిందంటూ వివరించారు. గత చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. వ్యవస్థలను నాశనం చేసిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పౌరుల కనీస ప్రాథమిక హక్కులను గత ప్రభుత్వం కాలరాసిందన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ పాలన సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల యొక్క అన్ని హక్కులను రాజ్యాంగపరంగా కాపాడుతున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానంతో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ.. కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తూ.. ప్రతిఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం, సొంత ఇళ్లు కల్పిస్తున్నారన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ సమాజ సేవకు పునరంకితమవ్వాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం జగనన్న రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని తెలిపారు. కానీ అధికారంలో ఉండగా దళితులలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. కానీ దళిత మహిళను తొలి కేబినెట్ లో హోమ్ మంత్రిని చేసిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ స్పూర్తితో సమ సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు ఎండి షాహినా సుల్తానా హఫిజుల్లా, అలంపూర్ విజయలక్ష్మి, నాయకులు అలంపూర్ విజయ్, ఉమ్మడి వెంకట్రావు, రమేష్ రెడ్డి, సురేష్, అఫ్రోజ్, అశోక్, కోటేశ్వరరావు, చిన్ని, చక్రవర్తి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News